నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరిస్తూ మొదలైనదే తెలంగాణ ఉద్యమం. 1969లో ఉవ్వెత్తున ఎగిసిన ఈ ఉద్యమం అనేక కారణాల వల్ల నెమ్మదిగా చల్లారి పోయింది.
ఆ తర్వాత 2001లో కేసీఆర్ స్థాపించిన ‘తెలంగాణ రాష్ట్ర సమితి’తో మళ్లీ ఉద్యమ సెగ మొదలైంది. ఈసారి అది దావానలంలా మారి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించింది.
కేసీఆర్ నేతృత్వంలో కొత్త సర్కారు కొలువు దీరింది. 5 సంవత్సరాల పూర్తి స్థాయి పరిపాలను పూర్తి కాకుండానే ఆయన 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి మళ్లీ విజయం సాధించారు.
నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో గద్దెనెక్కిన టీఆర్‌ఎస్ సర్కారు రెండు టర్మ్‌లు పరిపాలన సాగించింది. అయినప్పటకీ ఈ విషయాల్లో అనుకున్న స్థాయిలో పనిచేయలేదనే భావన ప్రజల్లో ఉండిపోయింది.
నీళ్లు విషయంలో మిషన్ భగీరధ, కాళేళ్వరం, మిషన్ కాకతీయ అంటూ హడావుడి చేశారు. ఇక నిధుల విషయంలో కేంద్రం నుంచి సాధించింది పెద్దగా లేదనే చెప్పాలి. మరో ముఖ్యమైన విషయం నియామకాలు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడగానే లక్షలాదిగా ఉన్న నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
కానీ కేసీఆర్ సర్కార్ కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్‌లు, పరీక్షల నిర్వహణను కూడా వివాదాస్పదం చేసింది. దీనికి తోడు చాలా శాఖల్లో రిటైర్డ్ ఉద్యోగులను నియమించుకుని నిరుద్యోగులకు మొండి చేయిచూపింది.
ఈ విషయాన్ని ప్రధాన అస్త్రంగా తీసుకుని ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కొత్త ఉద్యోగాల భర్తీకి యుపీఎస్‌సీ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
తాజాగా మంగళవారం చీఫ్ సెక్రటరీ శాంతికుమారి రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఎక్కడెక్కడ రిటైర్డ్ అధికారులు కొనసాగుతున్నారో లెక్కలు ఇవ్వాలని అన్ని విభాగాలను ఆదేశించారు.
అది కూడా 24 గంటల్లోనే జరగాలని చెప్పడం ఇప్పుడు రిటైర్ అయ్యి కూడా మళ్లీ ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న అధికారుల్లో టెన్షన్ రేపుతోంది.
ఈ వివరాల సేకరణ అనంతరం వారందరినీ తొలగించి, అవసరమైన మేరకు పదోన్నతులు కల్పించడం, దానితో పాటు కొత్త ఖాళీ అయిన ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు జారీ చేసి, భర్తీ చేయడం లక్ష్యంగా రేవంత్‌రెడ్డి సర్కార్ ఆలోచనగా అనిపిస్తోంది.