
రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్‌ను ఎదుర్కొంది. తొలిరోజు కలెక్షన్లపై వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున రూ.186 కోట్ల గ్రాస్ వసూలైందని ప్రకటించడం వివాదానికి దారితీసింది. ఈ విషయంపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తగా, ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాయి.
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ కలెక్షన్ల విషయంపై తనదైన శైలిలో స్పందించారు. GC (గేమ్ ఛేంజర్) అనే పేరుతో వర్మ తన ఎక్స్ అకౌంట్ ద్వారా పలు సెటైరికల్ పోస్టులు చేశారు. “జీసీ మొదటి రోజున నిజంగా రూ.186 కోట్లు వసూలు చేసిందని చెప్పుకుంటే, ‘పుష్ప 2’ సినిమాకు మొదటి రోజు రూ.1860 కోట్లు రావాలి,” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అంతే కాకుండా, “గేమ్ ఛేంజర్’కు రూ.450 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తే, RRR లాంటి గొప్ప విజువల్ వండర్ కోసం 4500 కోట్లు ఖర్చు చేయాలి,” అంటూ తన అభిప్రాయాన్ని ప్రస్తావించారు.
వర్మ తన పోస్టుల్లో తెలుగు సినిమాలను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చిన రాజమౌళి, సుకుమార్ వంటి దర్శకులను ప్రశంసిస్తూ, GC టీమ్ తీసుకున్న నిర్ణయాలను నిందించారు. “బాహుబలి, RRR, KGF 2, కాంతార వంటి చిత్రాల విజయాలు తెలుగు సినిమా గౌరవాన్ని పెంచాయి. కానీ GC వెనుక ఉన్న మేకర్స్ నమ్మశక్యం కాని అబద్ధాలతో ఈ విజయాలను దెబ్బతీశారు,” అని అన్నారు.
తన అభిప్రాయాన్ని మరింత వివరించిన వర్మ, “ఈ వసూళ్ల వెనుక ఎవరున్నారో నాకు తెలియదు, కానీ అది నిర్మాత దిల్ రాజు కాదని నేను నమ్ముతున్నాను. ఆయన నిజాయతీ కలిగిన వ్యక్తి, మోసం చేయడం ఆయనకు చేతకాదు,” అన్నారు. ‘గేమ్ ఛేంజర్’ చూసిన తర్వాత ‘పుష్ప 2’ కోసం అల్లు అర్జున్, సుకుమార్ కాళ్లపై పడి నమస్కరించాలని అనిపిస్తోందని కూడా ఆయన వ్యంగ్యంగా పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా, GC చిత్రానికి సంబంధించి ఉన్న వివాదం మరింత పెద్దది అవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న మెగా వెర్సెస్ అల్లు వార్ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు అల్లు ఫాన్స్ ని కృషి చేస్తుంటే మరోపక్క మెగా ఫాన్స్ కి కోపం తెప్పిస్తున్నాయి.రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ పోస్టులు అభిమానుల్లో మరియు సినీ వర్గాల్లో కొత్త చర్చలకు దారితీసాయి.