ఏరంగంలోనైనా ముందు మనం నిలదొక్కుకోవటానికి ప్రయత్నం చేస్తాం. అందులో సక్సెస్ అయితే ఆతర్వాత పేరు, ప్రతిష్ఠలను ఆశిస్తాం. ఆ తర్వాత మన కష్టానికి ప్రతిఫలంగా వచ్చే గుర్తింపు(అవార్డులు)ను ఖచ్చితంగా ఆశిస్తాం.
ప్రతి రంగంలోనూ గుర్తింపు తెచ్చుకున్న వారికి ప్రోత్సాహంగా కొన్ని సంస్థలు అవార్డులు ఇస్తుంటాయి. అవి ఆయా ఫీల్డ్ల్లో ఉన్న వారికి మరింత ప్రోత్సాహంగా ఉంటాయి. ఇలాంటి అవార్డు ప్రభుత్వం నుంచి అందుకుంటే ఆ గుర్తింపే వేరు.
ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా కళారంగానికి చెందిన వారికి విషయం అయితే ఇక చెప్పక్కర్లేదు.
ఈ కోవలోకి చెందినదే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే తెలుగు సినిమా, నాటకరంగ ‘నంది’ అవార్డులు.
గతంలో ప్రతి ఏటా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ఈ నంది అవార్డులను ఉగాదినాడు అందజేసేవారు.
దీనికి అగ్రహీరోల నుంచి టాప్ టెక్నీషియన్స్ కూడా ఈ అవార్డు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసేవారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ ఈ అవార్డులను అటకెక్కించాయి.
చాలా కాలంగా సినీ పరిశ్రమ నుంచి అవార్డుల కోసం అభ్యర్ధనలు వస్తున్నప్పటికీ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.
ఈ విషయంలో అటు సినీ పరిశ్రమతో పాటు ఇటు ప్రజల్లోనూ అసంతృప్తి ఉంది. ఈ అవార్డుల విషయంలో ఎక్కువగా సీనియర్ నటులు మురళీమోహన్ ఎక్కువగా స్పందిస్తుంటారు.
తాజాగా మురళీమోహన్ 50 సంవత్సరాల నట ప్రస్థానం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లోని హోటల్ దస్పల్లాలో వీబీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ సన్మాన కార్యక్రమానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమట్టిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మరోసారి మంత్రికి నంది అవార్డుల గురించి విజ్ఞప్తి చేశారు.
ఈ అవార్డులు అందుకోవాలనే తపనతో చాలా మంది కళాకారులు ఎదురు చూస్తున్నారని అన్నారు. వెంటనే స్పందించిన మంత్రి ఇప్పటికే సీఎంతో దీనిపై చర్చ జరిగిందని, 2024 ఉగాదికి నంది అవార్డులను మళ్లీ పునరుద్ధరిస్తామని,
ఈ విషయమై త్వరలోనే కొందరు సినీ ప్రముఖులను ముఖ్యమంత్రి గారి దగ్గరకు తీసుకెళ్లి మాట్లాడిస్తానని మంత్రి చెప్పారు. ఈ వార్తతో సినీ, నాటక రంగాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.