అయితే రామోజీ గార్ని కూడా వ్యాపారాలు మానేయమనండి…

0
307
But let Ramoji Garni also stop doing business

పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టు.. మనుషులందు ధైర్య శాలులు వేరయా అని చెప్పుకోవాలి. చేసే పనిమీద చిత్తశుద్ధి, టైమింగ్‌ ఉంటే చాలు ఏ ఉద్యోగికయినా.. అంతకు మించి అతని పర్సనల్‌ విషయాల్లోను..

ఆఫీస్‌ అవర్స్‌ ముగిశాక అతను చేసే పనులు గురించి పట్టించుకుని, అతన్ని నిలదీస్తే.. రామోజీ రావు అంతటి వారికే దిమ్మతిరిగి పోయే సమాధానం వస్తుంది. ఆ తర్వాత ఉన్న గౌరవం పోయి లాక్కోలేక.. గోక్కోలేక ఏడవాలి. ఇలాంటి ఓ సంఘటన గురించి తెలుసుకుందాం.

ఆయన ఓ కార్టూనిస్ట్‌ చాలాకాలంగా ఈనాడు సంస్థలో పనిచేస్తున్నారు. మహానగరంలో బతకడమంటే ఒక్క జీతంతో పనికాదు కదా. అందుకే ఆయన పార్ట్‌టైమ్‌గా రచయితగా మారారు. ఆఫీసు పని వేళలు ముగిశాక రచయిత అవతారం ఎత్తేవారు.

అలా సినిమా ఫీల్డ్‌లో ఘోష్ట్‌ రచయితగా పేరు తెచ్చుకున్నారు. కామెడీలు, పేరడీలు రాయడంలో ప్రసిద్ధుడు కావడంతో ప్రముఖ దర్శకుడు ఈవీవీకి బాగా దగ్గరయ్యారు. ఆయన దగ్గరే ఘోస్ట్‌ రైటర్‌గా మారారు.

ఓవైపు ఉద్యోగం, మరోవైపు రచయితగా రెండో అవతారం. ఇలా డబుల్‌ యాక్షన్‌తో సంసారం లాగిస్తున్న ఆయనకు ఓరోజు సంస్థ నుంచి షోకాజ్‌ నోటీసు వచ్చింది. దాని సారాంశం మీరు కార్టూనిస్ట్‌గా కొనసాగుతూనే రచయితగా కూడా పనిచేస్తున్నారు.

కాబట్టి మీ మీద చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పండి అని. ఓరోజు క్రమశిక్షణ కమిటీ ఈయన్ను పిలిపించింది. విరణ ఇవ్వమంది.

దానికి ఆయన సార్‌ నేను ఈనాడు సంస్థలో కార్టూనిస్ట్‌ని, ఆఫీస్‌ అవర్స్‌లో నేను బయట ఏదైనా చేస్తే తప్పు. పోనీ నేను బయట కార్టూన్‌లు వేస్తే తప్పు.

కానీ నేను బయట రచయితగా కొనసాగుతున్నాను. దానికి, ఇక్కడ నేను చేసే పనికి సంబంధం లేదు అన్నారు. అయినా కమిటీ సంతృప్తి పడలేదు. దాంతో ఒళ్లు మండిన ఈయన సార్‌.. రామోజీగారు ‘ఈనాడు’ సంస్థను మాత్రమే నడపడం లేదు కదా..

మార్గదర్శి, ఫిల్మ్‌సిటీ, ప్రియా పచ్చళ్లు ఇలా రకరకాల వ్యాపారాలు చేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నారు. మరి అది తప్పుకాదా? అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు. దీంతో కమిటీకి ఏం చెప్పాలో అర్ధం కాక బిక్కమొహాలు వేశారు.

వారి బాధను అర్ధం చేసుకున్న సదరు కార్టూనిస్ట్‌ అప్పటికప్పుడే ఓ కాగితం తీసుకుని తన రాజీనామాను రాసి వారి చేతిలో పెట్టి వచ్చేశారు. ఎంతైనా ఆత్మాభిమానం ముందు ఏదైనా దిగదుడుపే కదా…