సంక్రాంతి పండుగకు సినీ లవర్స్ కి కానుకగా వచ్చిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. నిన్న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునే విధంగా రూపొందించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం ప్రధాన ఆకర్షణ. నవరసాలు పండేలా, వినోదం ప్రధానంగా రూపొందించిన ఈ సినిమాలో వెంకటేష్ నటన మరోసారి తన మార్క్ చూపించింది.
వెంకటేష్ భార్య, ప్రియురాలి మధ్య ఇరుక్కుపోయే వ్యక్తి పాత్రలో అద్భుతంగా నటించారు. ఆయన మేనరిజంతో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించి అలరించారు. ఈ తరహా పాత్రలు వెంకటేష్‌కి అలవోకగా సూటవుతాయి. ఈ సినిమాను ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా రూపొందించామని, ఆ లక్ష్యం నెరవేరిందని చిత్ర బృందం వెల్లడించింది.
సినిమా విడుదలైన తర్వాత సక్సెస్ సెలబ్రేషన్స్‌లో చిత్ర యూనిట్ పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. హీరో వెంకటేష్‌తో పాటు హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ హాజరయ్యారు. విజయోత్సవంలో క్రాకర్స్ కాల్చి, కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగలో ఈ సినిమా విజయం సాధించడంతో “సంక్రాంతి విజేత సంక్రాంతికి వస్తున్నాం” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, వెంకటేష్ గారి ప్రోత్సాహం వల్లే ఈ సినిమా ఈ స్థాయిలో విజయం సాధించిందని పేర్కొన్నారు. వెంకటేష్ గారు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నారని, ఈ బ్లాక్‌బస్టర్‌ను ఆయనకు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. వెంకటేష్ మాట్లాడుతూ, అనిల్ రావిపూడి తో తన కాంబినేషన్ మరో విజయాన్ని అందించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కి మాంచి వినోదాన్ని అందించిందని చెప్పారు.
నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ కూడా ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేస్తూ, అనిల్ రావిపూడికి కృతజ్ఞతలు తెలిపారు. అనిల్ రావిపూడి వరుస విజయాలతో తన ప్రత్యేకతను నిరూపించుకుంటున్నారు. ఆయన తదుపరి చిరంజీవి తో కలిసి సినిమా చేయనున్నారని, అదే స్థాయిలో మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సంక్రాంతి విజయం అనిల్ రావిపూడి అన్‌స్టాపబుల్ హిట్ రికార్డును మరింత స్ట్రాంగ్ గా మార్చింది.