మనం చేసే అతివల్లనే ఒక్కోసారి మనకు తెలియకుండానే కానరాని అనర్ధాలు జరుగుతూ ఉంటాయి. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు అంటారుగా ఆ టైపు అన్నమాట. అధికారం చేతిలో ఉంది కదా అని విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ..
న్యాయాన్ని నిలబెట్టాల్సిన బాధ్యతను విసర్మించి మనం చేసేదే న్యాయం అనుకుంటే ఫలితం అనుభవించక తప్పదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ న్యాయాన్యాయాల మధ్య పోరు తుది దశకు చేరుకుంటోంది. దివంగత ముఖ్యమంత్రి వై.యస్.
రాజశేఖరరెడ్డి రాజకీయ వారసత్వ పోరాటంలో ఆయన కుటుంబం తాడోపేడో తేల్చుకోనున్నట్టు జరగబోయే పరిణామాలను గమనిస్తే అర్ధమౌతుంది.
2019 ఎన్నికల్లో జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఆంధ్రప్రదేశ్‌లో చక్కర్లు కొట్టిన ఆయన స్వంత సోదరి షర్మిళ ఇప్పుడు జగన్‌కే ఎదురు తిరిగి జగన్ బద్ధశత్రువు అయిన కాంగ్రెస్‌పార్టీ పగ్గాలు చేపట్టారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పులివెందుల అసెంబ్లీ నుంచి గానీ, కడప పార్లమెంట్ నుంచి గానీ పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదే జరిగితే జగన్ ప్రతిష్ఠ మరింత దిగజారే అవకాశం కనిపిస్తోందని వైసీపీ గుబులు పడుతుంటే.. తాజాగా వై.యస్.ఆర్ సోదరుడు,
మాజీ మంత్రి వై.యస్. వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఏపీ రాజకీయాల్లో అనేక సంచలనాలు నమోదు అయ్యే అవకాశం ఉంది.
తాజాగా సమాచారం ప్రకారం సునీతారెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుని ఆమెను కడప ఎంపీగా పోటీ చేయించే ఉద్దేశ్యంలో షర్మిళ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సునీత కూడా అంగీకరించారట.
తన తండ్రి హత్య విషయంలో దోషులుగా భావిస్తున్న వారికి బుద్ధి చెప్పాలనే ఆలోచనతో సునీత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన వెంటనే తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు అలర్ట్ అయ్యారట.
ఇప్పటికే షర్మిళను ఎలా ఎదుర్కోవాలో తెలియక తికమక పడుతుంటే.. ఇప్పుడు సునీత ఎంట్రీ ఖచ్చితంగా జగన్‌కు పెద్ద మైనస్ కానుంది.
అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగి సునీతకు ఫోన్ చేసి.. ‘‘రాజకీయంగా నువ్వు ఏ స్టెప్ తీసుకున్నా.. అనవసరం ఇబ్బందులు కొనితెచ్చుకుంటావు’’ అని బెదిరించారని వార్తలు వస్తున్నాయి.
దీనికి సునీత కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారట. నిజంగా సునీత కడప ఎన్నికల బరిలో నిలబడితే ఇద్దరు చెల్లెళ్ల దెబ్బ జగన్‌ను కోలుకోలేని స్థితికి తీసుకు వెళుతుందని గట్టిగా చెప్పవచ్చు.