ఏపీసీసీ అధ్యక్షురాలిగా షర్మిళ.. ఏఐసీసీ ప్రకటన

0
190
AICC announcement of Sharmila as APCC president
AICC announcement of Sharmila as APCC president

ఏపీ కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన ఉత్కంఠను కలిగించిన ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలపై కాంగ్రెస్‌ పార్టీ తెర దించింది. ఈ పదవికి వై.యస్‌. షర్మిళను నియమిస్తూ అధికారికంగా నిర్ణయం తీసుకుంది.

ఈ విషయాన్ని ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. షర్మిళను ఏపీసీసీ అధ్యక్షురాల్ని చేయడం దాదాపు ఖరారు అయినప్పటకీ హర్షకుమార్‌ వంటి కొందరు సీనియర్‌ నేతలు దీన్ని వ్యతిరేకించడంతో కొంత సందిగ్ధత నెలకొంది.

దీంతో లగడపాటి రాజగోపాల్‌ను పంపి సమస్య సర్దుమణిగేలా చేశారనే ఊహాగానాలు ఉన్నాయి. దీనికితోడు షర్మిళ సైతం తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా హర్షకుమార్‌ను స్వయంగా కలిసి ఆహ్వానించడంతో ఆయన మొత్తబడినట్లుగా అనిపిస్తోంది.

2019లో ఏపీలో ఎన్నికలు జరిగిన అనంతరం ముఖ్యమంత్రి, తన అన్న జగన్‌మోహన్‌రెడ్డితో వచ్చిన వ్యక్తిగత విభేదాల కారణంగా షర్మిళ తెలంగాణలో ‘వైఎస్సార్‌ తెలంగాణ’ పేరుతో పార్టీని స్థాపించారు.

ఆ పార్టీ తరపున ఖమ్మంజిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. ఇందుకోసం అక్కడ స్థానికంగా అందుబాటులో ఉండేలా పార్టీ కార్యాలయాన్ని కూడా స్థాపించారు.

అయితే రాజకీయంగా చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో తన పార్టీని ఎన్నికల బరి నుంచి తప్పించి, కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు.

కేవలం బీఆర్‌ఎస్‌ మరోసారి గెలవకూడదనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు. అయితే తన పార్టీని కాంగ్రెస్‌లో కలపటానికి అప్పటికే చర్చలు పూర్తి అయిన సందర్భంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు జోరుగా ప్రచారం సాగింది.

APCC reins to Sharmila Gidugu resigns

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అప్పుడే ఆమెకు ఏపీ కాంగ్రెస్‌ పగ్గాలు అప్పగించేలా హామీని కూడా పొందారు. తాజాగా అధికారికంగా ఈమేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి.

దీనిపై ఏపీసీసీ అధ్యక్షురాలి హోదాలో ట్విట్టర్‌ వేదికగా ఆమె స్పందిస్తూ… పార్టీ నాకు అప్పగించి ఈ బాధ్యతను నా శక్తి మేరకు నిర్వహిస్తాను.

ఏపీలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు, అధికారంలోకి తీసుకు రావటానికి అందరితో కలిసి పనిచేస్తాను. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తేవడమే మా అందరి లక్ష్యం.

నాకు ఏపీసీసీ పదవి అప్పగించినందుకు సోనియా గాంధీ గారికి, మల్లిఖార్జున ఖర్గే గారికి, రాహుల్‌ గాంధీ గారికి ఇతర పార్టీ పెద్దలకు ధన్యవాదాలు అని ట్వీట్‌లో పేర్కొన్నారు.