తెలుగు రాష్ట్రాల ప్రజలకు పాదయాత్రలంటే కొత్తకాదు. ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్ర ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపాయి.
ఆ తర్వాత జగన్, చంద్రబాబు, షర్మిళ ఇలా పాదయాత్రలకు కొత్త క్రేజ్ తెచ్చారు. ఆమధ్య కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా పాదయాత్ర చేశారు. ఈ యాత్ర వల్ల పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది.
దీన్ని తాజాగా ఆయన ఆదివారం నుంచి ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ పేరుతో మరో సుధీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తొలి యాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఉన్న అఖండ భారతాన్ని జోడిస్తూ ఏకతాటిపైకి తీసుకురావడం అయితే..
ఈ తాజా యాత్ర ద్వారా రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ సాధనే లక్ష్యంగా, దేశంలో సమన్యాయాన్ని కల్పన లక్ష్యంగా సాగనుంది.
జాతుల మధ్య రేగిన చిచ్చుతో రగిలిపోతున్న మణిపూర్‌లోని తౌబల్ జిల్లాలోని కోంగ్జోమ్ గ్రామం నుంచి ప్రారంభం అయిన ఈ యాత్ర 15 రాష్ట్రాల్లోని 100 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 6,713 కి.మీ సాగనుంది.
ఇందులో భాగంగా కొంత మేర పాదయాత్రను, కొంత మేర బస్సు యాత్రను కొనసాగించనున్నారు. ఈ యాత్ర ఎక్కువ భాగం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సాగనుంది.
ఈ రాష్ట్రంలోని 337 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఇది సాగనుంది. ఇక్కడ కాంగ్రెస్ కంచుకోటలు అమేధీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాలతో పాటు ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి కూడా ఈ యాత్రలో కవర్ కానుంది.
ఈ యాత్రలో రాహుల్ గాంధీ ప్రజల నుంచి పెరిగిన ధరలు, నిరుద్యోగం, సామాజిక న్యాయం, ఇతర కీలక సమస్యలతో పాటు స్థానిక సమస్యలపై అభిప్రాయం సేకరించనున్నారు.
అలాగే పై విషయాలపై ఆయన తన అభిప్రాయాన్ని కూడా ప్రజలతో పంచుకుంటూ ముందుకు సాగనున్నారు. యాత్ర సాగే రాష్ట్రాల్లోని
ఇండియా కూటమి మిత్ర పక్షాలు ఉన్న ప్రాంతాల్లో వారు కూడా ఈ యాత్రలో పాలు పంచుకోవాల్సిందిగా కాంగ్రెస్ ఆహ్వానాలు పంపింది. ఏది ఏమైనా రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై ఈ యాత్ర ప్రభావం ఎంత ఉంటుందో చూడాలి.