సినిమాల్లో అయినా.. రాజకీయాల్లో అయినా ఓ స్థాయికి చేరుకున్న తర్వాత మనం వేసే ప్రతి అడుగు మన చేతుల్లో ఉండదు.
అంతకు ముందు వరకూ మనం చేసే పని మనకు, మన కుటుంబానికి మేలు చేస్తుందా? కీడు చేస్తుందా? ఉపయోగం ఉందా? లేదా?.. మనకు గానీ, మన కుటుంబానికి గానీ సంతోషాన్ని ఇస్తుందా? ఇవ్వదా?
అనే కోణంలో ఆలోచిస్తుంటాము. అయితే ఒక్కసారి సెలబ్రిటీలుగా ఎదిగిన తర్వాత మన కుటుంబం అంటే మన అభిమానులు, ప్రజలు కూడా అని అర్ధం చేసుకోవాలి.
ఈ క్రమంలో మనం తీసుకునే ప్రతి నిర్ణయం విషయంలో.. మనం వేసే ప్రతి అడుగు విషయంలో ఒకటికి 10సార్లు ఆలోచించుకోవాలి. లేదంటే మనల్ని అభిమానించే వారు బాధపడతారు.
ఇలా ఇటు రాజకీయంగానూ, అటు సినిమా రంగంలోనూ టాప్ సెలబ్రిటీగా మారిని పవన్ కల్యాణ్ వంటి వ్యక్తులు అయితే మరింత జాగ్రత్తతో వ్యవహరించాలి.
కానీ పవన్ కల్యాణ్ చేసిన ఒక పని ఇప్పుడు ఆయన అభిమానులను నిరుత్సాహానికి గురి చేస్తోంది. పవన్ అలా చేయకుండా ఉండాల్సింది అంటూ అభిమానులు బాధ పడుతున్నారు.
విషయంలోకి వెళితే.. తమిళనాడులోని వేల్స్‌యూనివర్సిటీ మంచి ప్రసిద్ధి చెందింది. త్వరలోనే 14వ స్నాతకోత్సవం జరుపుకోవటానికి ముస్తాబవుతోంది.
ఈ సందర్భంగా ఆ యూనివర్సిటీ పవన్ కల్యాణ్‌కు డాక్టరేట్ ప్రకటించింది. పవన్ గౌరవార్ధం తాము ప్రకటించిన ఈ డాక్టరేట్‌ను స్నాతకోత్సవం సందర్భంగా వచ్చి అందుకోవాలని కోరుతూ ఆయనకు లేఖ రాసింది.
పవన్ మాత్రం తాను రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చాలా బిజీగా ఉన్నానని, రావటం కుదరదని, కాబట్టి ఆ డాక్టరేట్‌ను సమాజంలో చాలామంది తనకన్నా అర్హత కలిగిన వ్యక్తులు ఉన్నారని వారిలో ఎవరికైనా ఇవ్వాలని కోరుతూ రిప్లై ఇచ్చారు.
అయితే పవన్ అభిమానులు మాత్రం అన్నయ్య ఆ డాక్టరేట్‌ను అందుకుంటే బాగుంటుందని, ఇకపై తాము తమ అభిమాన నటుడు, నేతను డాక్టర్ అని గౌరవంగా సంబోధించుకునే అవకాశం మిస్ చేసుకున్నామని బాధ పడుతున్నారు.
అయినా అదే డాక్టరేట్‌ల కోసం ఎంతోమంది పైరవీలు చేస్తున్న ఈ కాలంలో తనకు రావటానికి ఖాళీ లేని కారణంగా డాక్టరేట్‌ను తిరస్కరించడం కొంత విస్మయంగానే ఉంది.