యంగ్ హీరో విశ్వక్‌సేన్ తన నటనలో విభిన్న కోణాలను చూపిస్తూ, ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘లైలా’లో విశ్వక్ ప్రధాన పాత్రలో అలరించబోతున్నాడు. సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ కథానాయికగా నటించింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈమధ్య కాలంలో ఎవ్వరూ చేయని ప్రయోగాత్మకమైన కథతో వస్తున్న విశ్వక్ ఈ సినిమాలో అబ్బాయిగా, అమ్మాయిగా రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. లైలా గెటప్‌లో విశ్వక్ కనిపించడం నిజంగా సర్‌ప్రైజ్. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ప్రమోషన్లు సినిమాపై పాజిటివ్ బజ్‌ను తీసుకొచ్చాయి. ‘ఇచ్చుకుందాం బేబీ.. ముద్దు ఇచ్చుకుందాం బేబీ..’ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
విశ్వక్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ, ఇది తన కెరీర్‌లో చాలా ప్రత్యేకమని చెప్పారు. దర్శకుడు రామ్ నారాయణన్ చెప్పిన కథ విన్న వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నానని, ఇంత ఫన్ రైడ్ మూవీ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని పేర్కొన్నారు. అమ్మాయిగా ఉన్న పాత్రలో ఎలా కనిపిస్తానో తెలుసుకోవాలని, తన తండ్రికి లైలా గెటప్‌లో వీడియో కాల్ చేసినప్పటి అనుభవాన్ని కూడా విశ్వక్ ఆసక్తికరంగా చెప్పాడు. తన తండ్రే తనను గుర్తు పట్టలేకపోయారు అంటే ఆ గెటప్ ఎంత నేచురల్‌గా ఉందో అర్థమవుతుందన్నారు.
నిర్మాత సాహు గారపాటి కూడా ఈ సినిమాలో విశ్వక్ చేసిన ప్రయోగం గొప్పదని పేర్కొన్నారు. ఈ తరహా పాత్రలో నటించడానికి చాలా ధైర్యం అవసరమని, విశ్వక్ తన నటనతో అందరినీ ఆశ్చర్యపరుస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. రిచర్డ్ ప్రసాద్ ఛాయాగ్రహణం, యోన్ జేమ్స్ అందించిన సంగీతం ఇప్పటికే మంచి స్పందన తెచ్చుకున్నాయి.
ఈ సినిమా విశ్వక్ నటనలో కొత్తదనాన్ని చూపించడమే కాకుండా, అతని కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని చిత్రబృందం చెప్పింది. ‘లైలా’ పాటలు, ట్రైలర్ చూసిన ప్రేక్షకులు కూడా సినిమాపై ఆశలు పెంచుకున్నారు. ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల మనసును ఎంతవరకు గెలుచుకుంటుందో చూడాలి.