తెలుగు సినిమా చరిత్రలో సూపర్‌స్టార్ కృష్ణది ఓ సువర్ణాధ్యాయం. నిర్మాతల పాలిట కల్పతరువుగా, కార్మికుల ఆకలిని గమనించి సంవత్సరానికి 10 సినిమాలకు పైగా చేస్తూ పరిశ్రమ బాగు కోరిన వ్యక్తి కృష్ణగారు. అలాంటి కృష్ణగారు తన కారుపైన షూటింగ్‌కు కావాల్సిన కటౌట్‌లను పెట్టుకుని లొకేషన్‌కు వెళ్లడం యూనిట్‌లో చర్చకు దారి తీసింది.
వివరాల్లోకి వెళితే… అది ‘అగ్నిపర్వతం’ సినిమా షూటింగ్. కృష్ణ, విజయశాంతిల మీద ‘‘ఈ గాలిలో…’’ పాట చిత్రీకరణ ఊటీలో చిత్రీకరిస్తున్నారు. ఓరోజు యూనిట్ అంతా స్పాట్‌లో అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతలో దర్శకుడు కె. రాఘవేంద్రరావు టెన్షన్‌గా ఉన్నారు. ఈ పాటలో ఉపయోగించాల్సిన కృష్ణగారి భారీ ఫొటో ఫ్రేమ్స్ (కటౌట్స్) ఇంకా లొకేషన్‌కు చేరలేదు. మరోవైపు హీరోగారు కూడా ఇంటి దగ్గర బయలుదేరారని ఫోన్ వచ్చింది. ఏం చేయాలో తోచడం లేదు.
అర్జంట్‌గా పరుచూరికి.. నా ఫోన్‌లాంటిది ఇవ్వండి
ఈ టెన్షన్‌లో ఉండగా కొద్ది సేపటికి హీరో కృష్ణగారి కారు వస్తోంది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న రాఘవేంద్రరావు కళ్లు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తున్నారు. కారుపైన షూటింగ్‌కు కావాల్సిన ఫ్రేమ్‌లు తాడుతో కట్టి ఉన్నాయి. కంగారుగా రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వనీదత్ కృష్ణగారి కారు దగ్గరకు వెళ్లారు. నవ్వుతూ కారు దిగిన కృష్ణగారు, కారులోంచి దిగిన వారితో త్వరగా దింపడయ్యా.. అంటూ రాఘవేంద్రరావు దగ్గరకు వచ్చారు.
ఈలోగా కారులోంచి దిగిన వర్కర్‌లతో అశ్వనీదత్ ‘‘కృష్ణగారి కారుమీద ఆ కటౌట్‌లు ఏంటయ్యా…బుద్దుందా మీకు..’’ అంటూ కోపగించుకుంటున్నారు. అది విన్న కృష్ణగారు ‘‘దత్తుగారు వాళ్ల తప్పేమీ లేదండి. దారిలో వారి మెటాడోర్ వ్యాన్ పాడైపోతే నేను అటుగా వస్తున్నాను కాబట్టి చూశాను. ఎలాగూ ఈ కటౌట్‌లు లేకుండా మనం సాంగ్ కూడా చేయలేం.
ఇక నేను ముందు వచ్చి లాభంలేదు. ఇవి వచ్చేలోగా మనందరం ఖాళీగా కూర్చోవాలి. దాని వల్ల మీకు టైంవేస్ట్, మనీ వేస్ట్. ఇదంతా ఎందుకని నేనే నా కారుపైన వీటిని పెట్టి కట్టమని బలవంతం చేశాను’’ అన్నారు. దీంతో యూనిట్ మొత్తం నిర్మాతల గురించి కృష్ణగారు ఎంతగా ఆలోచిస్తారో అనుకుంటూ హ్యాపీగా ఫీలయ్యారట ఆరోజు. దటీజ్ కృష్ణ.