అర్జంట్‌గా పరుచూరికి.. నా ఫోన్‌లాంటిది ఇవ్వండి

0
283
paruchuri gopalakrishna aswanidath

సినిమా వాళ్ల సిత్రాలే వేరు.. ఆనందమైనా.. కోపమైనా.. బాధైనా వాళ్లకు అదోటైపు ఎమోషన్‌.. అప్పటికప్పుడు తీర్చేసుకోవాలి. లేకపోతే లావైపోతామనే భయం వారిది. అలా తన ఆనందాన్ని ఫోన్‌ను గిఫ్ట్‌ ఇచ్చి తీర్చుకున్న అశ్వనీదత్‌ గురించి తెలుసుకుందాం.

అది మెగాస్టార్‌ చిరంజీవి నటించిన సూపర్‌డూపర్‌హిట్‌ ‘ఇంద్ర’ ప్రీ ప్రొడక్షన్‌ టైం. చిన్నికృష్ణ ఈ చిత్రానిక కథకుడు, పరుచూరి బ్రదర్స్‌ మాటలు, అశ్వనీదత్‌ నిర్మాత, బి. గోపాల్‌ దర్శకుడు. అప్పటికే ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలకు బాలయ్య బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోయారు. పైగా జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ఆది, సినిమా చేసి ఉన్నాడు.

పైగా చిరంజీవికి తొలి ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ చిత్రం. పైగా వైజయంతి మూవీస్‌కి ప్రతిష్ఠాత్మకం. ఎటు నుంచి చూసినా అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌. చిన్నికృష్ణ కథగా చెప్పినప్పుడు దాదాపు 10వేల అడుగుల దాకా వచ్చేలా ఉంది. దాన్ని పగలు, రాత్రి కష్టపడి పరుచూరి సోదరులు 7వేల అడుగుల వరకూ తీసుకొచ్చారు. ఫ్యాక్షన్‌లో యాక్షన్‌ సినిమా.. పైగా మెగాస్టార్‌ హీరో కాబట్టి పంచ్‌లకు కూడా తక్కువలేదు.

paruchuri gopalakrishna aswanidath

చిరు సిగరెట్‌ కృష్ణంరాజుగారి జేబులో!.

ఓరోజు అశ్వనీదత్‌, పరుచూరి గోపాలకృష్ణ డిస్కషన్‌లో కూర్చున్నారు. తన ఆస్థిపాస్తుల్ని సీమ ప్రజల కోసం ప్రాజెక్ట్‌కు కొరకు ఖర్చుచేసి, ఆనక మరల సీమలోకి అడుగుపెట్టకూడదు అన్న ఒప్పందం మీద హీరో వారణాసి వెళ్లి డ్రైవర్‌గా బతుకుతున్నాడు. అక్కడ అనుకోని పరిస్థితుల్లో విలన్‌లకు మరల ఎదురు నిలుస్తాడు. వారు ఇంద్రను ‘‘మళ్లీ సీమకు నువ్వొస్తావ్‌… బతకడానికి కాదు.. మా చేతుల్లో చావనీకి’’ అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతారు.

కట్‌ చేస్తే హీరో అశేషజనవాహిని నీరాజనాల మధ్య మళ్లీ సీమలోకి అడుగుపెడతాడు. నేరుగా విలన్‌ ఇంటికి వెళతాడు. అక్కడ ‘‘రాననుకున్నారా.. రాలేననుకున్నారా..’’, ‘‘కాశీకి పోయాడు.. కాషాయం మనిషైపోయాడు.. వారణాసిలో ఉన్నాడు.. తన వరస మార్చుకున్నాడు.. అదే రక్తం.. అదే పౌరుషం.. వంటి కొన్ని మాస్‌కా బాప్‌ డైలాగ్‌లు చెపుతాడు.

డైలాగ్‌లు అయితే సూపర్‌గా పేలాయి ఓకే.. కానీ విలన్‌ ఇంటికి వచ్చి అతనికి ఓ స్వీట్‌ వార్నింగ్‌లాంటి పంచ్‌ డైలాగ్‌ ఒకటి పడితే గానీ ఈ సీన్‌కు మెగా ఎలివేషన్‌ ఉండదు అనేది అశ్వనీదత్‌గారి అభిప్రాయం ఇదే పరుచూరి గోపాలకృష్ణగారితో అన్నారు. గోపాలకృష్ణగారు తలవంచుకుని పేపర్‌పై ఏదో రాస్తున్నారు.

కొద్దిసేపటికి ఆయన ముఖంలో చిరునవ్వు. ఆ చిరునవ్వు తనకు కావాల్సిన పంచ్‌ డైలాగ్‌ను తెచ్చేసింది అని అశ్వనీదత్‌ గారికి అర్ధమైపోయింది. ఒక్క క్షణం తర్వాత తలపైకెత్తిన గోపాలకృష్ణ ‘‘విలన్‌ ముఖేష్‌రుషి చిరంజీవి గారితో కొట్లాటకు సయ్యా అనే అర్ధంతో ‘‘సయ్యా..’’ అంటాడు. దానికి చిరంజీవి గారు ‘‘సై… అంటే సెకనుకో హెడ్‌ తీసుకెళ్తా.. ఇంద్ర… ఇంద్రసేనారెడ్డి’’ అంటూ కోర మీసం తిప్పుతారు చిరంజీవిగారు’’ అన్నారు.

అంతే అశ్వనీదత్‌గారికి ఎక్కడలేని ఆనందం పొంగుకొచ్చింది. పక్కనే ఉన్న మేనేజర్‌ను పిలిచి ‘‘నేను వాడుతున్న ఈ ఫోన్‌లాంటి ఫోన్‌ ఒకటి అర్జంట్‌గా తెప్పించి పరుచూరి గారికి గిఫ్టివ్వండయ్యా’’ అన్నారు. దత్తు గారు ‘సోనీ ఎరిక్సన్‌’ ఫోన్‌ వాడేవారు. అది లేటెస్ట్‌, హైఎండ్‌ కూడా. దాంతో రెండు గంటల్లోనే గోపాలకృష్ణగారి చేతిలో ఆ ఫోన్‌ ప్రత్యక్షం అయ్యింది. ఆ ఫోన్‌ చాలాకాలం భద్రంగా వాడుకున్నారు గోపాలకృష్ణ. ఇప్పటికీ అది ఆయన దగ్గర ఉందట.