సెంటిమెంట్‌లకు, మెమరబుల్ అకేషన్స్‌కు పెట్టింది పేరు చిత్ర పరిశ్రమ. దీనికి భాషాబేధాలు ఏమీ లేవు. అన్ని భాషల చిత్ర పరిశ్రమలూ ఈ తానులో ముక్కలే.
కానీ టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన వెంకీ మాత్రం తన 75వ చిత్రం మెమరబుల్‌గా ఉండాలని భావించలేదేమో అనిపిస్తోంది.
దీనికి తోడు సంక్రాంతి సెంటిమెంట్‌తో ఎన్నో విజయాలు అందుకున్న వెంకీ ఈసారి రాంగ్ కథను ఎంచుకుని సంక్రాంతి బరిలోకి దిగాడనే విమర్శలు వస్తున్నాయి.
ఈ సంక్రాంతికి విడుదలైన నాలుగు చిత్రాల్లో లాస్ట్ నుంచి ముందు ఉన్నది వెంకీ నటించిన ‘సైంధవ్’ సినిమానే. చిన్న చిత్రంగా విడుదలై బ్లాక్‌బస్టర్ అయిన హనుమాన్ ఓవైపు దూసుకుపోతుంటే..
మిక్స్‌డ్ టాక్‌తో మహేష్ గుంటూరు కారం తన వాటా మార్కెట్‌ను తాను తెచ్చుకుంటోంది. ఇక మరో సీనియర్ హీరో నాగార్జున నటించిన నా సామిరంగ కూడా మంచి టాక్‌నే తెచ్చుకుంది. కానీ వెంకీ నటించిన సైంధవ్ మాత్రం చతికిల పడిరది.
సైంధవ్ సంక్రాంతి సినిమానే కాదు.. వెంకీకి ఇది 75వ సినిమా. అంటే అటు సంక్రాంతి సెంటిమెంట్‌తో పాటు, ఇటు మెమరబుల్ సెంటిమెంట్ కూడా ఉంది. సహజంగా వెంకటేష్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతారు.
వెంకీ కెరీర్‌లో సూపర్‌హిట్‌లలో చాలా వరకూ ఫ్యామిలీ లవ్‌స్టోరీలే. కానీ ఎందుకో తన బలమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను వదిలేసి, యాక్షన్ సినిమావైపు మొగ్గు చూపాడు.
సైంధవ్ కథ సెలక్షన్‌లో వెంకీపై కమల్, రజనీల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు కనిపించింది. ఎందుకంటే ఇటీవల వారిద్దరూ యాక్షన్ సినిమాలతో బాక్సాఫీస్‌లను కొల్లగొట్టారు.
ఇదే కోవలో తాను కూడా వెళ్లాలని నిర్ణయించుకోవడం వెంకీ వేసిన మొదటి తప్పటడుగు. పోనీ యాక్షన్ మూవీ చేసేటప్పుడు దాంట్లో సరైన బేస్ ఉండాలని కూడా చూసుకోలేదు.
కేవలం చైల్డ్ సెంటిమెంట్ ఒకటి ఉంటే చాలు అనుకున్నాడు. ఇదే అటు వెంకీకి, ఇటు సైంధవ్ మూవీకి మైనస్‌గా మారింది. ఏ కథను ఎప్పుడు చేయాలో వెంకీకి మంచి జడ్జిమెంట్ ఉంది.
సంక్రాంతి, లక్ష్మి వంటి ఫక్తు మూస కథలను కూడా వెంకీ టైమ్ సెన్స్‌తో హిట్‌లుగా మలుచుకున్నాడు. కానీ ఈసారి 75వ మూవీని మాత్రం మంచి మెమరబుల్‌గా మార్చుకోలేక పోయాడనే అభిప్రాయం వెంకీ అభిమానులతో పాటు, చిత్ర పరిశ్రమలో కూడా ఉంది.