జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులతో వెలుగులోకి వచ్చారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. అప్పట్లో ఆయన ఓ వర్గానికి హీరోలా మారితే.. మరో వర్గానికి విలన్‌గా మారారు. ఆ తర్వాత సమాజాన్ని సరైన దారిలో నడిపే రాజకీయాలకు అంకురార్పణ చేయాలని ఉద్యోగానికి రాజీనామా చేసి, రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత జనసేనలో చేరారు.
యాత్ర 2 ‘ ఫస్ట్ లుక్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్
2019 ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటూనే ఉన్నారు. ఆ తర్వాత లోక్‌సత్తా పార్టీని టేకోవర్ చేద్దామనుకుని, పబ్లిక్‌గార్డెన్స్‌లో మీటింగ్ పెట్టి చివరి నిముషంలో రద్దు చేసుకున్నారు.
ఇలా సాగిన ఆయన పొలిటికల్ జర్నీ ఇప్పుడు ‘జై భారత్’ అనే రాజకీయ పార్టీని స్థాపించడం ద్వారా కొత్త టర్న్ తీసుకుంది. జేడీ పార్టీని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు స్వాగతిస్తున్నప్పటికీ ఆయన ఎంచుకున్న ఎజెండా ఏపీకి ప్రత్యేక హోదా సాధన అనేది ఎవరికీ మింగుడు పడటం లేదు.
గతంలో ఇదే ప్రత్యేక హోదా ప్రధానాంశంగా ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన తెలుగుదేశం ప్రభుత్వం గానీ.. ఆ తర్వాత 2019లో ఇది కూడా ఒక ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గానీ అధికారంలోకి వచ్చినప్పటికీ సాధించింది మాత్రం శూన్యం.
ప్రజలు కూడా ఆ విషయాన్ని ఆల్రెడీ మర్చిపోయారు. జేడీ ఇప్పుడు ‘ప్రత్యేక హోదా’ ఎత్తుకోవడం వల్ల యూత్‌లో కొద్దో గొప్పో ప్రభావం కనిపించవచ్చు గానీ. అది ఆయన పార్టీకి ఏమాత్రం ఉపయోగపడని అశం.
ఎన్నికలు రెండు మూడు నెలల్లో ఉండడంతో ఆయన ఇంత తక్కువ సమయంలో ఏ మేరకు ప్రభావం చూపుతారు అనేది ఎవరికీ అర్ధం కావడం లేదు.
ఇప్పటికిప్పుడు ఆయన పొలిటికల్స్పేస్ క్రియేట్ చేసుకోవాలి. దీనికి చాలా కసరత్తు కావాలి. సమాజం పట్ల ఎంత బాధ్యత ఉన్నా.. రాజకీయ పార్టీని నడపడం అనేది సొమ్ముతో కూడిన పని. సగం హిందీ (జై), సగం ఇంగ్లీష్ (భారత్)లతో కూడిన ఉంది ఆ పార్టీ పేరు.
తెలుగు ప్రజలను అట్రాక్ట్ చేసే పదాలు పార్టీ పేరులోనే లేవు. దీనికి తోడు ఆయన ఆశించిన అభ్యుదయ భావజాలం ఇప్పటి ప్రజలకు ఎంతమేరకు ఎక్కుతుందో చెప్పలేం. అవినీతిని అంతం చేయాలనే ఆలోచనతో కేవలం రాజకీయ నాయకుల్ని మార్చాలని చూడటమే కాదు.. దీనికి అలవాటు పడిన ప్రజలను కూడా మార్చాలి.
వ్యక్తిగతంగా జేడీకి తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఉండవచ్చు. కానీ ఓట్ల విషయంలో మాత్రం అది పనికి రాదు. 2024లో అటు అధికార వైసీపీ (బీజేపీ అనధికార అండతో) ఇటు తెలుగుదేశం, జనసేనలు హోరాహోరీ తలపడబోతున్నాయి.
ఈ మధ్యలో మరెవరికో చోటు ఉంటుందనేది కలలో కూడా ఊహించలేని అంశం. చూడాలి రాబోయే రోజుల్లో జై భారత్ పార్టీ ఏ మేరకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి, దాన్ని ఓట్లుగా మలుచుకుంటుందో.