ఎప్పుడైనా అనుకున్నది ఒకటి.. అయ్యింది ఒకటి అయితే ఇబ్బంది గానీ.. అనుకున్నదే అయితే ఇక ఇబ్బంది ఏముంది. ఇలా సినీ పరిశ్రమ అనుకున్నంతా చేశారు జగన్‌మోహన్‌రెడ్డి. విషయం లోతుల్లోకి వెళితే.. ఆ మధ్య సినిమా పరిశ్రమకు ఏపీ ప్రభుత్వానికి మధ్య సినిమా టిక్కెట్ల అమ్మకం విషయంలో పంచాయితీ ఏర్పడిరది. సజావుగా సాగుతున్న సినిమా బిజినెస్‌లో వేలు పెట్టిన ఏపీ ప్రభుత్వం సినిమాల ద్వారా కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతోందని, దాన్ని ఒక క్రమపద్ధతిలోకి తేవటానికి అంటూ సినిమా టిక్కెట్ల అమ్మకాలను ఆన్‌లైన్‌లో చేపట్టాలని నిర్ణయించింది.
వెబ్‌సైట్ ద్వారా మాత్రమే కొనుగోలు
ఆల్రెడీ ఆన్‌లైన్‌లో టిక్కెట్లు అమ్ముతున్నారు కదా అనుకుంటున్నారా.. జగనన్న ప్రభుత్వం చెప్పేది ఆన్‌లైన్‌లో అమ్మటం అంటే వేరే వాళ్లు కాదు.. ఏపీ ప్రభుత్వమే అమ్మటం అన్నమాట. ఇది ఎఫ్‌డీసీ (ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో ప్లాన్ చేశారు. ఏపీ వ్యాప్తంగా ప్రదర్శింప బడే చిత్రాలు ఏవైనా సరే మనం చూడాలంటే ప్రభుత్వం ప్రవేశపెట్టే వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టికెట్‌లు కొనుగోలు చేయాలి. ఇప్పటికే ఈ వ్యాపారంలో ఉన్న ఇతర ఆన్‌లైన్ సంస్థలు ప్రభుత్వానికి 2 శాతం కమీషన్ చెల్లించాలన్నమాట.
పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య తేడా
ఈ విషయమై చిత్ర పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య తేడా వచ్చింది. ప్రభుత్వం టికెట్‌లు అమ్మడం ద్వారా వచ్చిన సొమ్మును నెల రోజుల తర్వాత పంపిణీదారులకు, నిర్మాతలకు తిరిగి చెల్లిస్తామని షరతు పెట్టింది. దీనిమీదే పెద్ద దుమారం రేగింది. భారీ బడ్జెట్ సినిమాలు తప్ప మిగిలిన వాటి జీవితకాలమే 3రోజులు 5 రోజులు. ఇలా మూడు రోజులు ఆడిన సినిమా డబ్బులను ప్రభుత్వం నెలరోజుల తర్వాత చెల్లిస్తే చిన్న నిర్మాతలు, డిస్టిబ్యూటర్స్ పరిస్థితి దారుణంగా ఉంటుంది. దీనిపై పరిశ్రమ అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పుడు ప్రభుత్వం అలాంటిదేమీ లేదు.. మీ డబ్బులు ఇప్పుడు ఎలా వస్తున్నాయో మేము కూడా అలాగే ఇస్తాం అని చెప్పింది.
నిరసన తెలియజేయాలని డిసైడ్
తాజాగా విడుల చేసిన జీవోలో ప్రతి సినిమా థియేటర్ ఆన్‌లైన్ విధానంపై ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకోవాలని డెడ్‌లైన్ పెట్టింది. అయితే ఈ జీవోలో ముందు నుంచి భయపడినట్లుగానే వసూలు అయిన సొమ్మును తిరిగి ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందో మాత్రం చెప్పలేదు. దీంతో చిత్ర పరిశ్రమ షాక్ అయ్యింది. మరోసారి తమ నిరసన తెలియజేయాలని డిసైడ్ అయ్యింది.