కల్వకుంట్ల శైలిమ.. కేటీఆర్ భార్యగా అందరికీ సుపరిచతురాలు. అందరికీ తెలిసి ఆమె ఓ గృహిణి. కానీ చాలామందికి తెలియని విషయం ఆమె కేసీఆర్ కుటుంబానికి చెందిన పత్రికలు ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికలకు సంబంధించిన డైరెక్టర్ కూడా. సరే గృహిణిగా ఉన్న ఓ మహిళ బిజినెస్ ఉమెన్‌గా ఎదిగితే అంతకంటే కావాల్సింది ఏముంది.
సంతోషం… కానీ ప్రజాధనాన్ని అప్పనంగా తన సంస్థలకు మళ్లించడంలో కీలక పాత్ర వహించడం ఇప్పుడు ఆమెకు చిక్కులు తెచ్చిపెట్టనుంది. అలాగే కేసీఆర్ దగ్గరి బంధువు, ఎంపీ జోగునపల్లి సంతోష్‌రావు కూడా అవినీతి మార్గాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల గండి పెట్టారు.
వెతక్కుండానే తీగలు కాంగ్రెస్ కాలికి తగులుతున్నాయి
ఫోరం ఫర్ ఎగైనెస్ట్ కరప్షన్ అనే సంస్థ ఆర్టీఐ దరఖాస్తు ద్వారా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐ Ê పిఆర్ డిపార్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వ ప్రకటనల రూపంలో ఏఏ పత్రికలకు, మీడియాకు ఎంతెంత చెల్లించారు అనే వివరాలు సేకరించింది. ఈ వివరాలు చూస్తే బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ కుటుంబం చేసిన దోపిడీ ఏస్థాయిలో ఉందో అర్ధం అవుతుంది.
శైలిమ కల్వకుంట్ల డైరెక్టర్‌గా ఉన్న నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలతో పాటు ముఖ్యమంత్రికి దగ్గర బంధువు, ఎంపీ జోగినపల్లి సంతోష్‌రావు నేతృత్వంలో నడిచే ‘టిన్యూస్’ ఛానల్‌కు కేటాయించిన సొమ్ములు కేవలం ఐదు సంవత్సరాల్లో మొత్తం సొమ్ములో 45శాతానికంటే ఎక్కువ అని తేలింది. ఈ మొత్తం సుమారుగా 500 కోట్ల రూపాయలు ఉందట.
అంటే ప్రజలు తమ కష్టార్జితంతో కట్టిన పన్నుల సొమ్మును కేసీఆర్ ప్రభుత్వం ఇలా తమ స్వంత సంస్థలకు అప్పనంగా కట్టబెట్టిందన్నమాట. గతంలో ఎన్నికల ప్రచారంలో అవినీతి పాల్పడేవారు ఎవరైనా సరే తల నరికేస్తా అని సంచలన ప్రకటన చేశారు.
మరి ఇప్పుడు తన కోడలు, మరో దగ్గరి బంధువు ఇలా అవినీతి మార్గంలో వందల కోట్ల ప్రజాధనాన్ని తమ స్వంత సంస్థలకు మళ్లించుకుని అవినీతికి పాల్పడిన విషయం బయటకు వచ్చింది కాబట్టి… కేసీఆర్ వారి తలలు తీస్తారో? లేదో? చూడాలి మరి అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
ఇప్పటికే ఫోరం ఫర్ ఎగైనెస్ట్ కరప్షన్ సంస్థ ఈ అవినీతికి సంబంధించి సెక్షన్ 13 కరెప్షన్ యాక్ట్ కింద ఐÊ పీఆర్ కమీషనర్ అరవింద్‌పైన, కేసీఆర్‌పైన తెలంగాణ స్టేట్ విజిలెన్స్ కమీషనర్, సీబీఐకి ఫిర్యాదు చేసింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఏదైనా అవినీతి సాక్ష్యాలతో సహా కనిపిస్తే తప్పకుండా దానిపై విచారణ చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే తమ కోర్టులోనే ఉన్న ఈ అవినీతి బంతితో ఎలా ఆడుకుంటారో చూడాలి మరి.