అమరావతి రైతులు అన్ని పార్టీల వారిని ఒకే వేదిక మీదకు తీసుకురావటం వెనుక కొత్త పొత్తులకు శ్రీకారం చుట్టినట్టు అయిందా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇప్పుడు మీడియాలో కూడా ఇదే విషయంపై చర్చోపచర్చలకు దారి తీస్తోంది. రాజధాని అమరావతి పేరుతో రైతులు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ ముందు నుంచీ ప్రత్యక్షంగా పాల్గొంటూనే ఉంది.
అందుకే అన్ని పార్టీలు ఒకే వేదికపైకి
మిగిలిన పార్టీలు ప్రత్యక్షంగా వారితో కలవకపోయినా.. పరోక్షంగా రైతుల న్యాయమైన కోరికకు మద్దతు తెలుపుతూనే ఉన్నారు. మూడు రాజధానలు విషయం తేలకపోవడం, వైసీపీ అసంబద్ధ స్టేట్‌మెంట్‌లు ఇస్తూ గందర గోళానికి గురి చేస్తుండటం తెలిసిందే. ఈ కారణంగానే తిరుపతి సభలో అన్ని పార్టీలు ఒకే వేదిక మీదకు ప్రత్యక్షంగా కలిసి వచ్చారన్నది మరో వాదన.
ఇది వైసీపీ స్వయంకృతాపరాధమే
అయితే ఈ కలకయిక కేవలం ఆ సందర్భంతో ముగిసి పోకుండా, భవిష్యత్ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం మెండుగా ఉన్నదనేది సత్యం. ప్రస్తుత ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఏ వేదిక ఏర్పడినా.. దానికి మద్దతు తెలపడానికి అన్ని రాజకీయ పార్టీలు సంసిద్ధంగా ఉన్న మాట వాస్తవం. ఇది వైసీపీ స్వయంకృతాపరాధంగానే చెప్పాలి.
గతంలో ఎప్పుడూ జరుగలేదు
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండున్నర సంవత్సరాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం, వైసీపీ(వైసీపీ ఎంపీ రఘురామరాజు పాల్గొన్నారు) ఇలా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు అన్నీ ఒకే వేదిక మీదకు రావడం అన్నది ఎప్పడూ జరగలేదు. రాబోయే రోజుల్లో జరిగే రాజకీయ పునరేకీకరణకు ఈ సభ పరోక్షంగా సహకరించినట్లుగా భావించవచ్చు. దీని పరిణామాలు భవిష్యత్ ఏపీ రాజకీయాల్లో తప్పని సరిగా ప్రభావం చూపిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు