గెలుపు, ఓటమి అన్నవి రాజకీయాల్లో సహజమే. అదే నాణానికి ఉన్న రెండు వైపులు వంటివి. నికార్సయిన నాయకుడు ఎప్పుడూ గెలుపుకు పొంగిపోడు.. ఓటమికి కుంగిపోడు.
తనను నమ్ముకున్న ప్రజల కోసం, తాను నమ్ముకున్న పార్టీ కోసం కట్టుబడే ఉంటాడు. అలాంటి కరుడుగట్టిన అభిమానులు, నాయకులు ప్రతి పార్టీకి ఉంటారు.
ఈ దేశాన్ని అత్యధిక కాలం ఏలిన కాంగ్రెస్ పార్టీలో అయితే ఇలాంటి వారికి కొదవే లేదు. ఎన్నో ఆటుపోట్లు, ఎత్తు పల్లాలు చూసిన పార్టీ అది. అటువంటి పార్టీలో సుధీర్ఘకాలం పనిచేసిన వారు ఓ పట్టాన దాన్ని వదిలి పోవాలంటే మనసొప్పదు.
అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత 2014 ఎన్నికల్లో జరిగిన ఘోర పరాభవం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ జరగలేదు. అప్పటి వరకూ అధికార పక్షంగానో.. ప్రతిపక్షంగానో ఉన్న కాంగ్రెస్‌కు 2014 ఎన్నికలు ఓ గ్రహణం లాంటివి.
175 సీట్లలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేక పోయింది. దీనికి అందరూ చెప్పే కారణం రాష్ట్ర విభజన. ఇందులో కొంత నిజం ఉన్నప్పటికీ..
అందులో కొంత దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన కొడుకు స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి కోణంలో కాంగ్రెస్‌ను చాలా వరకూ తుడిచిపెట్టేయడాన్ని కూడా పేర్కొనాలి.
2019 ఎన్నికల్లో కూడా ఏపీ కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. కానీ కాలం ఎల్లవేళలా ఒకేలా ఉండదు కదా.. ప్రస్తుతం మళ్లీ కాంగ్రెస్‌కు పూర్వవైభవం కాకపోయినా ఎంతోకొంత వైభవం దక్కేలానే కనిపిస్తోంది.
మరో మూడు నెలల్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ నిలబడి గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకునేలా ఉంది. వైయస్సార్ తనయ వై.యస్.
షర్మిళ నేతృత్వంలో పార్టీకి మళ్లీ జవసత్వాలు ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తోంది. దీనికి తగ్గట్టుగానే ఈరోజు రాజమండ్రిలో కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు, మాజీ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్‌లు భేటీ అయ్యారు.
పైకి ఇది మర్యాద పూర్వక కలయికే అని లగడపాటి అన్నప్పటికీ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కూడా ప్రధాన పోటీదారుగా నిలపాలనే తలంపుతో అధిష్ఠానం ఈ భేటీని వెనుక నుంచి ప్రోత్సహించింది అనే వాదనలు లేకపోలేదు.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా స్తబ్ధుగా ఉన్న కాంగ్రెస్ క్యాడర్ మళ్లీ పునరేకీకరణ అవుతున్నట్లు తెలుస్తోంది. చూద్దాం రాబోయే రోజుల్లో షర్మిళ ఎంట్రీ తర్వాత ఒక్కో విషయం తప్పకుండా బయటకు వస్తుంది.