తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి అందరి అంచనాలనూ తల్లక్రిందులు చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు రేవంత్‌రెడ్డి.
ఓ వైపు అధిష్ఠానం మనసుకు అనుగుణంగా మసలుతూనే ముఖ్యమంత్రిగా తన గౌరవం కాపాడుకుంటూ బ్యాలన్స్‌గా పనిచేసుకుంటూ పోతున్నారు. ఎన్నికల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన మీడియాతో మాట్లాడుతూ…
ఇక నుంచి తెలంగాణలో మా పార్టీ పాలన ఎలా భిన్నంగా ఉండబోతోందో మీరు చూడబోతున్నారు. గత పాలకులకు భిన్నంగా ప్రజా తెలంగాణను నిర్మించటానికి శాయశక్తులా కృషి చేస్తాం. ప్రజలు ఇది కదా మనం కోరుకున్న తెలంగాణ అని సంతోషించేలా చేస్తాం.
ఇందుకోసం నాతోపాటు నా సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా బాధ్యతతో వ్యవహరిస్తాం అన్నారు.
అన్నమాటకు కట్టుబడి వీలైనంత వివాదరహితంగా ప్రజలకు పాలన అందించాలని ఆయన ఎమ్మెల్యేలకు ఇతర ప్రజాప్రతినిధులకు హితబోధ చేస్తున్నారు.
సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని లోక్‌సభ నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు స్వీటు వార్నింగ్ ఇచ్చారు.
‘‘మీకు చుట్టాలు అవుతారనో, బంధువులు అవుతారనో అసమర్ధులైన అధికారులను క్షేత్రస్థాయిలో నియమించుకుంటే పార్టీకి చెడ్డపేరు వస్తుంది. దాన్ని నేను ఏమాత్రం సహించను.
సమర్ధులను ఎంపిక చేసుకోండి. ఏఏ అధికారి ఎక్కడ ఎలా వ్యవహరిస్తున్నాడు అనేది నాకు ప్రతి రోజూ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుస్తూనే ఉంటుంది.
జనవరి 26 తర్వాత నుంచి వారానికి ఓ మూడు రోజుల పాటు నేను సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకూ సెక్రటేరియెట్‌లో ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటాను.
అప్పుడు మీ సమస్యలు ఏవైనా ఉంటే నాకు చెప్పండి. అందరం కలిసికట్టుగా పనిచేసి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 17కు గాను ఖచ్చితంగా 12 స్థానాలను గెలుచుకోవాలి.
ప్రతి ఎమ్మెల్యేకు నియోజకవర్గ అభివృద్ధి కోసం 10 కోట్ల రూపాయలు కేటాయిస్తాను. మీరు చేపట్టే పనులతో ప్రజలకు గత ప్రభుత్వ పాలనకు,
మన ప్రభుత్వ పాలనకు మధ్య మార్పు స్పష్టంగా కనిపించాలి. అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు ఈసారి మనకు పడాలి. అందరూ దాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయండి అన్నారు.