ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు హైహీట్‌కు చేరుకున్నాయనే చెప్పాలి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నాయకులు పార్టీలు మారడంలో బిజీ బిజీగా గడుపుతున్నారు.
మరోవైపు వైసీపీ అధినేత జగన్ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల మార్పులు, కూర్పులతో తలమునకలై ఉండగా, విపక్షనేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు పలు కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నారు.
ఇలాంటి తరుణంలో పార్టీలు మారుతున్న నాయకులు ఆయా పార్టీల అధినేతలకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలుగుదేశం పార్టీని దాదాపుగా వీడిపోయినట్టే.
ఆయన కూతురు, విజయవాడ కార్పొరేటర్ అయిన కేశినేని శ్వేత కూడా తన పదవికి రాజీనామా చేశారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కేశినేని నాని వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు వైసీపీకి చెందిన ఓ రాజ్యసభ సభ్యుడు, మరో కీలక ఎమ్మెల్యే మంతనాలు సాగిస్తున్నారు. దీంతో గత వారం రోజులుగా నెలకొన్న హడావుడికి ఫుల్‌స్టాప్ పడుతుంది అనుకున్నారంతా.
కానీ కేశినేని నాని తన కండీషన్‌లు చెప్పగానే వైసీపీ గొంతులో పచ్చివెలక్కాయ్య పడ్డట్టు అయిందట. మొదట కేశినేనికి విజయవాడ ఎంపీ సీటు కేటాయిస్తే సరిపోతుంది అనుకున్న వైసీపీ అధిష్ఠానానికి ఇప్పుడాయన తన పార్లమెంట్
నియోజకవర్గంలోని 5 మంది తాను చెప్పిన వారికి టిక్కెట్‌లు ఇవ్వాలని కండీషన్ పెట్టారట. వైసీపీ అధిష్టానం మాత్రం ఒక ఎంపీ టిక్కెట్, ఒక ఎమ్మెల్యే టిక్కెట్ మాత్రమే ఇస్తామని తెగేసి చెప్పిందట.
కేశినేని కోరుతున్న టిక్కెట్‌లలో మైలవరం నుంచి బొమ్మసాని సుబ్బారావు, విజయవాడ తూర్పు నుంచి కేశినేని కుమార్తె శ్వేతకు, విజయవాడ పశ్చిమం నుంచి ఎం.ఎస్. బేగ్‌కు,
నందిగామ నుంచి కన్నెగంటి జీవరత్నం, తిరువూరు నుంచి నల్లగట్ల స్వామిదాసులు ఉన్నారు. అయితే ఇప్పటికే మైలవరం విషయంలో వైసీపీలోనే మంత్రి జోగి రమేష్‌కు సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు మధ్య తీవ్రపోటీ నెలకొని ఉంది.
అలాగే విజయవాడ తూర్పు నుంచి దేవినేని అవినాష్‌కు దాదాపు ఖరారు చేశారు. నందిగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు ఉన్నారు.
ఈయన సోదరుడు మొండితోక అరుణ్‌కుమార్ ఎమ్మెల్సీగా ఉన్నారు. దీంతో కేశినేని అత్యాశతో జగన్ ముందుకు వెళుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
మామూలుగానే జగన్‌తో వ్యవహారం ఓ రేంజ్‌లో ఉంటుంది. ఆయన ఎవరి మాట వినేరకం కాదు. దీనికి తోడు అతన్ని బ్లాక్‌మెయిల్ చేసి సీట్లు సాధించడం అంటే మాటలు కాదని కేశినాని నానికి తెలియక పోవచ్చు గానీ.. కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఏ వ్యక్తిని అడిగినా చెపుతారు.