ఈ సంవత్సరం భోగి మంటలకు రాజకీయంగా ప్రత్యేకత తీసుకురానున్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు.
రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసింది. ఇప్పటి వరకూ ఇరుపక్షాలూ విడివిడిగా వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై పోరాటం చేస్తుండగా, భోగి పండుగ నుంచి క్షేత్రస్థాయిలో సంయుక్తంగా పోరాటాన్ని మొదలు పెట్టబోతున్నారు.
ఇందులో భాగంగా ఆదివారం నాడు రాజధాని ప్రాంతమైన మందడంలో నిర్వహించబోయే భారీ భోగి మంటల కార్యక్రమానికి చంద్రబాబు`పవన్ కల్యాణ్‌లు హాజరు కానున్నారు.
రాజధాని ప్రాంత అభివృద్ధిని నిర్వీర్యం చేసి, రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వంపై రాజధాని ప్రాంత రైతులు నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్న సంగతి తెలింది.
ఇందుకోసం మందడంలో ప్రధాన నిరసన వేదికను వారు అప్పట్లో ఏర్పాటు చేశారు. ఆ వేదిక కేంద్రంగానే వారి నిరసనలు కొనసాగుతున్నాయి.
ఆదివారం ఇదే వేదిక దగ్గర భోగిమంటల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు హాజరుకానున్న చంద్రబాబు`పవన్‌లు వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన ప్రజా వ్యతిరేక నిర్ణయాల జీవోల కాపీలను ఈ భోగి మంటల్లో వేసి, రాజకీయ కాక రేపనున్నారు.
దీని ద్వారా క్షేత్రస్థాయిలో ఉమ్మడిగా వైసీపీని ఎదుర్కొనే కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టినట్టు అవుతుంది. ఎన్నికలు మరో రెండునెలలో ఉన్నందున ఇకపై ఈ నిరసనలు పూర్తిస్థాయిలో జోరందుకుంటాయి.
ఈ మేరకు శనివారం సాయంత్రం చంద్రబాబు నివాసంలో పవన్ కల్యాణ్‌తో జరిగిన డిన్నర్ భేటీలో నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయంగా తెలిసింది.
ఈ సందర్భంగా సీట్ల సర్దుబాటులో భాగంగా ఏర్పడిన చిక్కుముళ్లపై కూడా క్లారిటీకి వచ్చారట. అలాగే ఉమ్మడి మ్యానిఫెస్టో రూప కల్పనకు తుది రూపం ఇచ్చి,
పండుగ నాడు దాన్ని ప్రకటించే ఆలోచన కూడా ఉందని చెబుతున్నారు. ఏదిఏమైనప్పటికీ ఉమ్మడిగా వైసీపీపై తలపెట్టిన పోరుకు భోగి పండుగను ఎంచుకోవడం ఆసక్తి రేకెత్తిస్తోంది.