మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు చిత్ర సీమలో సృయంకృషితో తనదైన న భూతో న భవిష్యతి అన్నట్టుగా చరిత్రను సృష్టించిన నటుడు.
కోట్లాది ప్రజల హృదయాలు గెలుచుకుని, లక్షలాది మందికి రక్త, చూపును దానం చేసిన మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. అలాంటి వ్యక్తి జీవిత చరిత్ర రాసే అవకాశం ఎందరికి దక్కుతుంది. దానికి మించిన అదృష్టం ఏముంటుంది.
అలాంటి అదృష్టం దక్కించుకున్నారు ప్రముఖ రచయిత యండమూరి వీరేంధ్రనాథ్. విశాఖపట్నంలో శనివారం జరిగిన లోక్‌నాయక్ ఫౌండేషన్ 20వ వార్షికోత్సవంలో భాగంగా యన్టీఆర్ 28వ పుణ్యతిథి, ఏఎన్నార్ శతజయంతి కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా యండమూరి వీరేంధ్రనాథ్‌కు సాహిత్య పురస్కారం అందజేశారు ఫౌండేషన్ వ్యవస్థాపకులు, మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్షీప్రసాద్.
ఈ సందర్భంగా యండమూరి చిరంజీవి జీవిత చరిత్రను రాయాలని ఉందని, అది కూడా ఆయన అనుమతిస్తేనే అని అన్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడూతూ… నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఇరువురూ తెలుగు చిత్ర సీమకు రెండు కళ్లు. వారిద్దరితోనూ కలిసి నేను నటించడం నా పూర్వజన్మ సుకృతం.
యండమూరి గారు రాసిన ‘అభిలాష’ నవలను అప్పట్లో మా అమ్మగారు చదవడం జరిగింది. ఆ నవల్లో ఉన్న కథానాయకుడిగా నన్ను ఊహించుకున్నారట.
ఆమె ఊహకు దైవ బలం తోడవడంతో ఆ నవలను కె.యస్. రామారావు గారు సినిమాగా తీయడం, అందులో నేను నటించడం జరిగింది. యండమూరి గారితో పాటు ఎంతోమంది రచయితల దయ వలన నేను ఇన్ని మంచి పాత్రలు చేసి, ఈ స్థాయికి చేరుకున్నాను.
ఎన్నో లక్షల మందిని తన రచనల ద్వారా ఇన్‌స్పైర్ చేసిన వ్యక్తి యండమూరి. ఆయనలాంటి గొప్ప రచయిత నా జీవిత చరిత్రను రాస్తానంటే ఇంతకు మించిన అదృష్టం ఏముంటుంది. తప్పకుండా నా జీవిత చరిత్ర రాసే బాధ్యత ఆయనదే. అన్నారు.
కొణిదెల శివశంకర వరప్రసాద్‌గా మొదలై… మెగాస్టార్‌గా ఎదిన క్రమంలో చిరంజీవిపై ఎన్నో పుస్తకాలు వచ్చిన మాట వాస్తవమే. అయితే తన నటనతో కోట్లాది మందిని ఇన్‌స్పైర్ చేసిన వ్యక్తి జీవిత చరిత్రను…
తన రచనలతో కోట్లాది మందిని ప్రభావితం చేసిన వ్యక్తి రాస్తే అది సంచలనం కాకుండా పోతుందా.. సో.. వెయిట్ అండ్ సీ…