దాదాపు 50 సంవత్సరాల రాజకీయ జీవితం… మూడుసార్లు ముఖ్యమంత్రి, మూడుసార్లు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా.. ఇలా అప్రతిహతంగా సాగిన నారా చంద్రబాబు నాయుడి రాజకీయ జీవితం ఇప్పుడు త్రిశంకు స్వర్గంలోకి జారిందా?
అనే చర్చ ఇప్పు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోంది. మంగళవారం సుప్రీం కోర్టులో స్కిల్డెలప్మెంట్ కేసుకు సంబంధించి ఆయన దాఖలుచేసిన క్వాష్ పిటీషన్ (17`ఎ)పై ఇద్దరు జడ్జిలు భిన్నమైన తీర్పు ఇవ్వడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
గత తెలుగుదేశం పార్టీ హయాంలో స్కిల్‌డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన పనుల్లో అవినీతి పారిందని, ఈ విషయంలో కోట్లు రూపాయల నిధులు చంద్రబాబుకు దొడ్డిదారిలో చేరాయని ఆరోపిస్తూ జగన్ సర్కార్ ఆయనపై కేసును నమోదు చేసింది.
కేసు నమోదుతో పాటు అయన్ను అరెస్ట్ చేసి, రాజమండ్రి సెంట్రల్జైల్లో 52 రోజుల పాటు ఉంచిన విషయం తెలిసిందే. అనంతరం తాత్కాలిక బెయిల్ మంజూరు కావడం, ఆ తర్వాత అది పూర్తిస్థాయి బెయిల్‌గా మారడం జరిగింది.
ఈకేసుపై చంద్రబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించగా, గత సెప్టెంబర్ 22న ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ కొట్టివేసింది. అక్కడ ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లారు.
వాదోపవాదాల అనంతరం మంగళవారం ఈ కేసులో చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టంలోని 17`ఎ వర్తిస్తుందని జస్టిస్ అనిరుధ్ బోస్ తీర్పు ఇచ్చారు. మరో జడ్జి జస్టిస్ బేలా ఎం. త్రివేది మాత్రం 17`ఎ వర్తించదని తీర్పు ఇచ్చారు. దీంతో ఈ కేసును సుప్రీం విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు.
ఒకవేళ ఈ క్వాష్ పిటీషన్‌ను సుప్రీం విస్తృత ధర్మాసనం అనుమతిస్తే చంద్రబాబుపై పెట్టిన ఐఆర్ఆర్ కేసు, ఇసుక కేసు, మద్యంకేసులు కూడా వీగిపోతాయి.
ఇది చంద్రబాబు రాజకీయ జీవితానికి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారుతుంది. ఒకవేళ క్వాష్‌ను కొట్టేస్తే.. చంద్రబాబుపై జగన్ సర్కార్ మరిన్ని కేసులు పెట్టే అవకాశం ఉంది.
దీనివల్ల ఆయన రాజకీయ జీవితానికి ఇబ్బందలు కలుగుతాయి. ఇలా ప్రస్తుతం చంద్రబాబు పొలిటికల్ కెరీర్ ప్రస్తుతం త్రిశంకు స్వర్గంగా మారిందని చెప్పవచ్చు.