భవిష్యత్తుపై ఆశలు పెట్టుకోవడం తప్పుకాదు.. కానీ గతాన్ని మర్చిపోవడం మాత్రం మహాపాపం అంటుంటారు. చాలా మంది సెబ్రిటీలు తాము ఎదిగిన పరిసరాలను, ఎక్కి వచ్చిన మెట్లను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. నలుగురితో నారాయణ అన్న చందంగా మొదలైన తమ జీవితం అంచెలంచలుగా శిఖరాగ్రం చేరడం వెనుక తమను ప్రోత్సహించిన వ్యక్తులను, వ్యవస్థలను గుర్తు చేసుకోవడం వారి ఉన్నతికి నిదర్శనం.
దాసరి నారాయణరావు. రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, కేంద్ర మంత్రిగా ఇలా ఎన్నో ఉన్నత స్థాయిలకు స్వయం కృషితో ఎదిగిన వారు దాసరి. సినీ రంగంలో ఆయన ఎక్కని మెట్టులేదు.. ఆయన అందుకోని బిరుదు లేవు.. ప్రభుత్వం కూడా ఆయన్ను ‘పద్మ’ అవార్డుతో సత్కరించింది. ఇక సినీ సాంస్కృతిక సంస్థలు , కళాపరిషత్‌లు వంటివి ఇచ్చిన బిరుదులు వేయాలంటే ఓ చిన్న సైజు పుస్తకం అవుతుంది. ఇలా తనకు లెక్కకు మిక్కిలి బిరుదులు వచ్చినప్పటికీ దాసరికి మాత్రం సినీ పరిశ్రమ ఇచ్చిన ‘దర్శకరత్న’ అంటేనే ఇష్టం. ఆయన్ను అలా సంభోదిస్తే భోళా శంకరుడిలాగా పొంగిపోతారు.
ఇదే విషయమై ఓ సారి ఆయన స్పందిస్తూ.. ‘‘పాలకొల్లులో నాకు మాత్రమే తెలిసిన నన్ను, ప్రపంచానికి పరిచయం చేసి.. పార్లమెంట్ వరకు పంపింది చిత్రపరిశ్రమే. కళామతల్లికి కృతజ్ఞతలు చెబితే తీరేది కాదీరుణం. నాకు ఎన్ని గౌరవాలు, సత్కారాలు, పదవులు, బిరుదులు వచ్చినా చిత్ర సీమ ఇచ్చిన ‘దర్శకరత్న’ను మాత్రమే నా ఉనికికి సంకేతంగా భావిస్తా. సినిమా వాడిగా పెరిగిన నేను సినిమా వాడిగానే పోతాను. కళామతల్లికి అనునిత్యం నా మనసులో వందనం చేసుకుంటా’’ అంటూ తనను అక్కున చేర్చుకుని, ఆదరించి, పాలకొల్లు నుంచి పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఎదగటానికి కారణమైన చిత్ర సీమ పట్ల తన ప్రేమను, గౌరవాన్ని చాటుకున్నారు దాసరి.