వాళ్లిద్దరూ ఉండగా మీ వీధిలో నాకు పెద్దగా పనుండదు

0
345

ఇప్పుడంటే ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఏదైనా ప్రమాదం చోటు చేసుకున్నా, దొంగతనం జరిగినా క్షణాల్లో పోలీస్‌లకు సమాచారం తేలికైపోయింది. ఈ సీసీ కెమెరాలు, కరెంట్‌ ఫెన్సింగ్‌లు, సెన్సర్‌ సెక్యూరిటీలు లేని ఆ రోజుల్లో గుర్ఖాలపైనే ఆధారపడేవారు. ‘పారా హుషార్‌’ అంటూ చీకటి పడిరది మొదలు తెల్లవారే వరకూ వారు చేసే అలికిడే మనకు, మన ఆస్తులకు రక్షణగా నిలిచేది. ఇప్పటికీ గుర్ఖాలు ఉన్నారనుకోండి. అయితే వారి పని ఇప్పుడు సీసీ కెమెరాలు. మొబైల్‌ అర్ట్ లు చేసేస్తున్నాయి.

విషయంలోకి వస్తే ఒకప్పుడు మద్రాసు నగరంలోకి టి. నగర్‌ ప్రాంతం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమ ప్రముఖులతో వెలుగొంది పోయేది. మరి ఇంతమంది ధనవంతులు, ప్రముఖులు ఉన్నప్పుడు గుర్ఖాలు ఎంత బాధ్యతగా ఉండాలి. కానీ అంత్యంత ప్రముఖులు ఉండే బజుల్లా రోడ్డుకు సంబంధించిన గుర్ఖా మాత్రం తాను విధులు నిర్వర్తించాల్సిన రోడ్డుకు పెద్దగా వచ్చేవాడు కాదట. ఓసారి మామూళ్ల కోసం రాగా ఆ రోడ్డులోని ఓ ఇంటి ఓనర్‌ ఏవయ్యా నువ్వు వస్తున్న అలికిడే వినపడడం లేదు. మామాళ్లకు మాత్రం వచ్చావు అనగా, దానికి గుర్ఖా ‘‘సార్‌ మీ వీధిలో వాళ్లిద్దరూ ఉండగా నాకు పెద్దగా పనుండదు’’ అన్నాడట.

విషయం ఏమిటంటే బజుల్లా రోడ్డులో ఉండే ప్రముఖుల్లో యన్టీఆర్‌, దాసరి కూడా ఉన్నారు. వీరిద్దరి దినచర్య చాలా భిన్నంగా ఉంటుంది. యన్టీఆర్‌ దినచర్య ఉదయం 2.30 నిముషాలకు లేవడంతో మొదలవుతుంది. అంటే ఆయన నిద్రలేచే గంట ముందు నుంచి ఆయన ఇంట్లో పనులు మొదలవుతాయి అన్నమాట. అలాగే దాసరి షూటింగ్‌లు పూర్తి చేసుకుని ఇంటికి చేరిన తర్వాత మరల షూటింగ్‌లకు సంబంధించిన చర్చలు, స్క్రిప్ట్‌ వర్క్‌లు వంటివి పూర్తయి పడుకునే సరికి రాత్రి 2 గంటు అయ్యేదట.

అంటే చీకటి పడిరది మొదలు రాత్రి 2 గంట వరకూ దాసరి గారి స్టాఫ్‌, ఆయన్ను కలవటానికి వచ్చే ప్రముఖులతో హడావుడిగా ఉండేది. తెల్లవార్లు వీరిద్దరి వల్లా హడావుడిగా ఉండే ఆ వీధికి ఇంకా గుర్ఖాతో అంత పెద్ద అవసరం ఏముంది అనేది ఆ గూర్ఖా ఉద్దేశ్యం అన్నమాట. అదీ సంగతి.