రామానాయుడు రెండున్నర ఎకరాలు దానం చేస్తే.. తండ్రి

0
689

తెలుగు సినీ రంగంలో డి. రామానాయుడు అంటే తెలియని వారు ఉండరు. తెలుగు సినిమా ఖ్యాతిని హిమాలయాల ఎత్తుకు తీసుకు వెళ్లిన నిగర్వి ఆయన. ఏ పని చేసినా తనదైన ముద్ర ఉండాలని తపిస్తుంటారు నాయుడుగారు. ఈ విషయం ఆయన నిర్మించిన ప్రతి సినిమాలోనూ మనకు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అందుకే నిర్మాతగా ప్రపంచ రికార్డు బద్ధలు కొట్టారు. సినీ రంగంలో ఆయన చేతుల మీదుగా సాయం పొందిన వారి లిస్ట్‌ చాలా పెద్దదే. నాయుడు ఎంత ముక్కుసూటి మనిషో.. అంతటి దాన కర్ణుడు.

లోక్‌ సభ సభ్యునిగా తన వంతు నిధులతో పాటు, స్వంతంగా అప్పట్లోనే దాదాపు 9 కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టిన సేవా సంపన్నుడు డా॥ డి. రామానాయుడు. సినీ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత సంపాదించిన కోట్ల రూపాయలను ఇలా దానం చేయడం అలవాటు చేసుకున్నాడు అనుకుంటే పొరపడినట్లే. దాన గుణం నాయుడిగారిలో చిన్న తనం నుంచే ఉంది. తొమ్మిది సంవత్సరాల వయస్సులో రెండున్నర ఎకరాల పొలాన్ని దానం చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచారు నాయుడుగారు.

అప్పట్లో ఆచార్య వినోబా భావే భూదానోద్యమాన్ని ఉదృతంగా ప్రజల్లోకి తీసుకు వెళుతున్నారు. ఈ క్రమంలో అనేక గ్రామాలు పర్యటించి భూస్వాముల్ని ఎంతో కొంత భూమిని దానం చేయమని కోరారు. ఈ పర్యటనలో భాగంగా నాయుడిగారి స్వగ్రామం కారంచేడు కూడా వచ్చారు. కారంచేడు కూడలిలో ఏర్పాటు చేసిన సభలో అందరూ తమ వంతుగా తలో ఎకరం, అర ఎకరం ప్రకటిస్తున్నారు. ఇంతలో నాయుడుగారు తన వంతుగా రెండున్నర ఎకరాలు దానం ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఈ విషయం విన్న వినోబా భావేతో సహా స్టేజ్‌ మీద ఉన్న పెద్దలు ఆశ్చర్య పోయారు. అప్పటికి నాయుడిగారి వయస్సు 9 సంవత్సరాలు. ఈ విషయం తండ్రి వెంకటేశ్వర్లుకి చేరవేశారు. ఇక ఆయన చేతిలో బుడతడికి బడిత పూజే అని అందరూ డిసైడ్‌ అయిపోయారు. అయితే వెంకటేశ్వర్లు గారు మాత్రం నాయుడుగారిని ముద్దు పెట్టుకుని నా పరువు నిబెట్టావురా.. అంటూ తమ వంతు వాటాగా ప్రకటించిన రెండున్నర ఎకరాలను ముగ్గురు వ్యవసాయ కూలీలకు పంచి పెట్టారు. అలా నాయుడు గారు సేవ-దాన గుణాలు కవల పిల్లల్లా కలిసి పెరిగాయన్నమాట.