కృష్ణ-విజయనిర్మల అన్నా చెల్లెలుగా

0
1034

సినిమా జయాపజయాలకు అనేక కారణాలు ఉంటాయి. కొన్ని సినిమాలు కథ బాగుంటే కాస్టింగ్‌ ఫెయిల్‌ అవుతాయి. కొన్ని కాస్టింగ్‌ సూపరో సూపర్‌ అనుకున్నా కథ లేక చతికిల పడతాయి. మరికొన్ని ఈ రెండూ బాగున్నా ఇతర టెక్నికల్‌ అంశాలు పేలవంగా మారటంతో బాక్సులు ఇంటిదారి పడతాయి. ఇలా కాస్టింగ్‌ ఫెయిల్యూర్ బారిన పడిన మంచి చిత్రం ‘బొమ్ము చెప్పిన కథ’.

ఇందులో సూపర్‌స్టార్‌ కృష్ణ, కాంతారావు హీరోలు కాగా, విజయనిర్మల, గీతాంజలి హీరోయిన్‌లు. జానపద జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం కోసం అప్పట్లో 18 సెట్లు వేయడం సంచలనం. కొడైకెనాల్‌లో పాట చిత్రీకరణతో సినిమా ప్రారంభం అయింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమా అయినప్పటికీ, అప్పుడే కొత్తగా వచ్చిన పార్ట్‌లీ కర్‌ ట్రెండ్‌ను అనుసరించి రెండు పాటలను తీశారు.

సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో తీసిన ఈ సినిమాకు దర్శకుడు జి. విశ్వనాథం. సత్యనారాయణ, రాజబాబు, ధూళిపాళ, ప్రభాకర్‌రెడ్డి, మిక్కిలినేని, విజయలిత, రమాప్రభ వంటి తారాగణంతో పాటు సముద్రాల జూనియర్‌ మాటలు, దాశరథి, శ్రీశ్రీ పాటలు, కె. బాపయ్య సహకార దర్శకత్వం వంటి దిగ్గజాలు పని చేసినా సినిమా అంతగా ఆడలేదు. కారణం… ఈ సినిమాలో కృష్ణ సరసన విజయ నిర్మలకు బదులుగా గీతాంజలిని తీసుకున్నారు. విజయనిర్మల కృష్ణకు చెల్లెలుగా నటించింది.

అప్పటికే వీరిద్దరూ హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. పైగా ఇద్దరూ మరికొద్ది రోజుల్లో వివాహం కూడా చేసుకోబోతున్నారు అనే వార్త అప్పటికే చక్కర్లు కొడుతోంది. ఈ సమయంలో వీరిద్దరినీ అన్నాచెల్లెలుగా చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడలేదు. దీంతో ఎంతో ఖర్చుతో నిర్మించిన చిత్రం అయినప్పటికీ ఫెయిల్యూర్ ‌గానే మిగిలింది. ఈ సినిమా విడుదలైన కొద్ది నెలకు కృష్ణ-విజయ నిర్మల పెళ్లి చేసుకున్నారు.