ఫోన్‌ చేయకుండానే ఫిలింనగర్‌కు ఫైరింజన్‌లు పోటెత్తాయి

0
613

అది 1984వ సంవత్సరం.. అప్పటికి ప్రస్తుత ఫిల్మ్‌నగర్‌, జూబ్లీ హిల్స్‌లు ఇంకా కొండలు, గుట్టలుగానే ఉన్నాయి. ప్రస్తుతం ఫిల్మ్‌ ఛాంబర్‌ ఉన్న ప్రాంతం నుంచి చూస్తే చుట్టూ కిలో మీటర్ల దూర ప్రాంతాలు కనపడేవి. ఓ రోజు ఉన్నట్టుండి చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి ఫైరింజన్‌లు రయ్‌.. రయ్‌ మంటూ ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రాంతానికి దూసుకొచ్చేశాయి. ఎదురుగా ఉన్న కొండపై ఉన్న ఓ అద్భుతమైన బంగళా మంటల్లో కాలిపోతోంది. అంతా కోలాహలం.. అటు ఫైర్‌ సిబ్బంది, ఇటు పోలీస్‌ సిబ్బంది ఉరుకులు, పరుగుల మీద రావడంతో అక్కడ ఏదో జరిగిపోతోందని చుట్టు ప్రక్క నివసించే జనాలు సైతం అక్కడకు చేరుకున్నారు. తీరా అక్కడి విషయం విని అంతా అవాక్కయ్యారట.

విషయంలోకి వస్తే.. సూపర్‌స్టార్‌ కృష్ణ హీరోగా భారీ చిత్రాల నిర్మాత సి. అశ్వనీదత్‌ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘అగ్నిపర్వతం’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ఓ యాక్షన్‌ సన్నివేశం కోసం భారీ హౌస్‌ సెట్‌ను ప్రస్తుతం ఫిలిం ఛాంబర్‌ ఉన్న ప్రాంతానికి ఎదురుగా ఉన్న కొండపై నిర్మించారు. ఇందులో హీరో కృష్ణ ఇంట్రడక్షన్‌ సీన్‌ ఉంటుంది. ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో విలన్‌ గ్యాంగ్‌ హీరోను చంపటానికి ప్లాన్‌ చేస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణ విలన్‌ ఆట కట్టించి ఆ భవనాన్ని బాంబులతో పేల్చేస్తాడు.

ఈ సన్నివేశానికి సంబంధించిన సీన్‌ చిత్రీకరణ పూర్తయిన మీదట చివరి సీన్‌గా ఈ హౌస్‌ సెట్‌కు నిప్పు పెట్టారు. దీంతో భారీ స్థాయిలో నల్లటి పొగతో కూడిన అగ్ని కీలలు ఎగసి పడ్డాయి. అప్పటికి అంతా ఓపెన్‌ ప్రాంతం కావడంతో చాలా దూరం ఈ పొగ, మంటలు కనిపించడంతో నిజంగానే అక్కడ ఏదో అగ్ని ప్రమాదం సంభవించిందనుకుని సమీపంలోని ఫైర్‌ స్టేషన్‌ సిబ్బందితో పాటు, పోలీస్‌ సిబ్బంది కూడా అక్కడకు చేరుకున్నారు. తమ వల్ల ఏర్పడిన అనవసర టెన్షన్ కు నిర్మాత అశ్వనీదత్‌ క్షమాపణలు చెప్పడంతో అంతా సర్ధు మణిగింది. అదనమాట కథ.