40 లక్షలకు రూపాయి తగ్గినా చేయను అన్నాడు

0
533

అవకాశం రావాలే గానీ వెండితెరపై వెలిగిపోవాలని ఎవరికి మాత్రం ఉండదు. అలాంటి అవకాశం సంపాదించడానికి ఎంతగా చెమటోడ్చాలో సినీ రంగంలో సెబ్రిటీలుగా వెలిగిపోయిన, పోతున్న ప్రతి ఒక్కరికీ బాగా తెలుసు. ఆ కష్టాలు మామూలుగా ఉండవు. అందుకే ‘‘కష్టాలందు సినిమా కష్టాలు వేరయా..’’ అంటారు. అలా తాను ఎన్నో కష్టాలకు ఓర్చుకుని తెలుగు సినీ రంగంలో స్టార్‌ హీరోగా తనకంటూ ఓ ముద్ర వేసుకున్న నటుడు వయసు మళ్లడంతో ఇంటికే పరిమితం అయ్యాడు.

అదృష్టం ఉంటే ఇంట్లో కాళ్లు చాపుకుని కూర్చున్నా అవకాశాలు తలుపు తడతాయి అన్న మాటను నిజం చేస్తూ ఆయనకు ఆజన్మాంతం గుర్తుండిపోయే ఓ పాత్ర ఆయన దగ్గరకు వచ్చింది. అయితే రూపాయి విషయంలో విపరీతమైన పట్టును ప్రదర్శించే ఆ నటుడు 40 లక్షలకు ఒక్క రూపాయి తగ్గినా ఆ పాత్రను చేయనని మంకుపట్టు పట్టారు. దర్శక నిర్మాతలు ఎంతగా ఒప్పించాలని చూసినా ఆయన మాత్రం ససేమిరా అన్నాడు. ఇక చేసేది లేక ఆ పాత్రకు 15 లక్షలకు మరో నటుణ్ణి ఎంచుకున్నారు. సినిమా విడుదలైంది. సూపర్‌డూపర్‌ హిట్‌.

ఆ పాత్ర చేసిన నటుడు ఎక్కడికి వెళ్లినా ఇప్పటికీ ఆ పాత్రధారిగానే చూస్తూ చేతులెత్తి మొక్కుతున్నారు ప్రజలు. కొందరైతే ఏకంగా సాష్ఠాంగ నమస్కారాలు కూడా చేస్తున్నారట. విషయంలోకి వస్తే ఆ పాత్ర ‘అన్నమయ్య’ చిత్రంలోని కలియుగ దైవం వేంకటేశ్వరుని పాత్ర. మొదట సంప్రదించి నటుడు నటభూషణ్‌ శోభన్‌బాబు. ఆ తర్వాత ఆ పాత్ర చేరింది సుమన్‌ చెంతకు. సుమన్‌ కెరీర్‌లో ఇదొక మేలి మలుపుగా మిగిలిపోయింది. ఇప్పుడే కాదు.. మరో 4,5 జనరేషన్‌ ప్రజలు కూడా సుమన్‌ను ఆరాధనా భావంతో చూస్తూనే ఉంటారు.

సుమన్‌ నటనకు తోడు, ఆ పాత్రకు స్వర్గీయ ఎస్‌.పి. బాసుబ్రహ్మణ్యం చెప్పిన డబ్బింగ్‌ నభూతో న భవిష్యతి అన్నట్లుగా మారాయి. ఈ సినిమా విడుదల అనంతరం ఓ సందర్భంలో తనను కలిసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో శోభన్‌బాబు ‘‘నా జీవితంలో తెలిసి తెలిసి నేను చేసిన తప్పు వేళ్లమీద లెక్కపెట్టుకునేంత ఉంటాయి వాటిలో ‘అన్నమయ్య’ సినిమా వదులుకోవడం కూడా ఒకటి అన్నారట. జయాపజయాలకు, పొగడ్తలకు, విమర్శలకు అతీతంగా ఏదీ పట్టించుకోని శోభన్‌బాబు ఆ మాట అన్నారంటే ఆయన్ను ఆ పాత్ర ఎంతగా ప్రభావితం చేసిందో అర్ధం చేసుకోవచ్చు.