మనం 3 అంటే… మమత 4 అంటున్నారు!

0
124

ఇటీవల కాంలో ‘రాజధాని’కి బదులుగా ‘రాజధానులు’ అనే అంశంగా బాగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఏపీలో మూడు రాజధానుల అంశం తెరమీదకు వచ్చిన నాటి నుండి దేశ వ్యాప్తంగా ఒకే రాజధాని అనే అంశం కన్నా బహుళ రాజధానులు ఉంటే మేలని చాలా రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి. ఈ విషయంలో ఏపీలో ప్రతిపక్షాలు, అధికార పక్షం వాదోపవాదాలు స్టేజ్‌ నుంచి కోర్టుల్లో పోరాటాలు కూడా చేస్తున్నాయి. మూడు రాజధాలను అంశం మన రాష్ట్రంలో కాక రేపుతుంటే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏకంగా 4 రాజధానులు కావా టున్నారు. ఆమె అడిగేది వారి రాష్ట్రానికి కాదండోయ్‌… మన దేశానికట.

సువిశాలమైన మన భారత దేశానికి 4 రాజధానులు ఉండటం ఎంతో ముఖ్యమని, ఈ రాజధానుల నుంచి రొటేషన్‌ పద్ధతిలో పరిపాలన సాగిస్తే అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసినట్టు అవుతుందని ఆమె అన్నారు. బ్రిటీషర్లు సైతం నాడు కోల్‌కతా రాజధానిగానే పరిపాలన సాగించారని గుర్తు చేశారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పనిలో పనిగా ఆమె బీజేపీపై కూడా విరుచుకుపడ్డారు. కేంద్ర నాయకులకు సంవత్సరానికి ఈ ఒక్కరోజే నేతాజీ గుర్తుకు వస్తారని, కానీ తాము మాత్రం ఎప్పుడూ నేతాజీ కుటుంబంతోనే ఉంటామని చురకలు అంటించారు. నేతాజీ జయంతిని పరాక్రమ దివస్‌గా ఎందుకు ప్రకటించారో నాకు ఇప్పటికీ అర్ధం కావడం లేదు. నేతాజీని రవీంధ్రనాథ్‌ ఠాగూర్‌ దేశనాయక్‌ అని అభివర్ణించారని, మేము కూడా ఆయన్ను దేశనాయక్‌గానే గుర్తిస్తామని అన్నారు. నేతాజీపై అంత ప్రేమ ఉంటే ఆయన జయంతి నాడు సెలవు దినంగా ఎందుకు ప్రకటించలేదో కేంద్రం చెబితే బాగుంటుంది అన్నారు.