అటు తిరిగి నమస్కారం పెట్టు.. ఇటు తిరిగి తాళి కట్టు

0
693

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మధురమైన ఘట్టం. అందుకే ఆకాశమంత పందిరి వేసి.. భూదేవంత ముగ్గు పెట్టి ఆనందంతో అందరినీ ఆహ్వానించి.. వారి ఆశీర్వాదాతో ఒక్కటవ్వాలని ఎందరో కలలుకంటూ ఉంటారు. మరికొందరు సాక్షాత్తూ ఆ భూదేవి.. శ్రీదేవిను హృదయ ఫలకంపై నుంచుకున్న కలియగ దైవం వెంకన్న సమక్షంలో ఒక్కటవ్వాలని ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ఈ కారణంగానే మనతో పాటు పక్కనే ఉన్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ వంటి అనేక రాష్ట్రాల ప్రజ లు తిరుమలలో వివాహం చేసుకోవడానికి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఇక్కడి దాకా వస్తుంటారు.

పేదలు సైతం స్వామివారి ఆశీర్వాదంతో ఒక్కటవ్వాలనే ఉద్దేశంతో టీటీడీ ప్రతి సంవత్సరం స్వంత ఖర్చుతో సామూహిక వివాహాలను జరిపిస్తుంటుంది. సామూహిక కల్యాణాలు సంవత్సరంలో నిర్దేశించిన సమయంలో మాత్రమే జరుగుతుంటాయి. అయితే పేద ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న పురోహిత సంఘం అతి తక్కువ ఖర్చుతో పేదల వివాహాలను జరిపిస్తూ వస్తోంది. అయితే కోవిడ్‌ కారణంగా టీటీడీ కొండపై వివాహాలను నిలుపుదల చేసింది.

ఇటీవల కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో మరల వివాహాలకు అనుమతి ఇచ్చింది. దీంతో కొండపై గల అనేక మఠాల్లో వివాహ తంతు జరుగుతోంది. కానీ పురోహిత సంఘంలో మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఈ కారణంగా శ్రీవారి సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటవ్వానుకుంటున్న జంటలు కుటుంబ సభ్యు లతో సహా పెళ్లి బట్టలు ధరించి స్వామివారి గుడి ఎదురుగా గల అఖిలాండం వద్దకు చేరుకుంటున్నారు. పురోహితులు లేకుండానే అటు తిరిగి స్వామి వారికి నమస్కారం చేసుకోవడం.. ఇటు తిరిగి తాళి కట్టడం చేస్తున్నారు.

ఈ విధంగా అయినా స్వామి వారి ఆశీర్వాదాలు తమను జీవితాంతం కాపాడుతూ ఉంటాయని భక్తులు నమ్ముతున్నారు. గత కొద్ది రోజులుగా అఖిలాండం వద్ద రోజూ దాదాపు 10కి పైగా వివాహాలు ఈ తరహాలోనే జరుగుతున్నాయంటే తిరుమలేశునిపై భక్తు లకు గల విశ్వాసానికి ఇంతకు మించి ఉదాహరణ ఏమి కావాలి.