అక్కడే దిక్కులేదు.. రాష్ట్రమంతా విస్తరిస్తారట!

0
589

తాను దూర సందులేదు.. మెడకో డోలా అన్నాడట వెనకటి ఒకడు. ‘సేవ్‌ అమరావతి’ పేరుతో 400 రోజుగా సాగిస్తున్న ఉద్యమం పరిస్థితి అలాగే ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని అమరావతి భూ కుంభకోణంపై దర్యాప్తు మొదలు పెట్టడం, అదే సమయంలో రాజధాని వికేంద్రీకరణ పేరుతో కర్నూలుకు న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్‌ రాజధాని అంటూ మూడు రాజధానుల ప్రకటన చేసింది. దీంతో ప్రతిపాదిత రాజధాని అమరావతి ప్రాంతంతో పాటు రాష్ట్రమంతా సంచలనం కలిగించింది.

ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. కేవలం అమరావతి మాత్రమే అన్నింటికీ రాజధానిగా ఉండాలంటూ ఆ ప్రాంతంలోని రైతులు(కొందరు వీరిని రియల్టర్లు అంటున్నారు అనుకోండి) నిరసన శిభిరాలు ఏర్పాటు చేశారు. ఈ నిరసనకు 400 రోజులు దాటి పోయాయి. నిజం చెప్పాంటే రాజధాని కోర్‌ ప్రాంతంలోని కొంత మందికి తప్ప ఈ నిరసనలు మిగిలిన రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి సోకలేదు. పక్కనే ఉన్న గుంటూరు, విజయవాడ వంటి నగరాల ప్రజలు కూడా ఈ నిరసనలు పట్టించుకోవడం లేదు.

పరిస్థితి ఇలా ఉంటే అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌ శివారెడ్డి రాజమండ్రిలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘అమరావతి సమస్య మొత్తం రాష్ట్రానిది. అన్ని జిల్లాల వారినీ ఇందులో భాగస్వాములను చేస్తాం. ఇప్పటి వరకూ 120 మంది రైతులు అసువులు బాసారు. వారి ప్రాణ త్యాగాల్ని వృధా కానివ్వం. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్‌ టేబుల్‌ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నాం’’ అన్నారు.

అమరావతి సమస్య రాష్ట్రం మొత్తానిదో కాదో.. అమరావతి నడి బొడ్డున వీరు వేసిన టెంట్‌లో కూర్చునే జనాలను లెక్క పెడితే తెలుస్తుంది. అక్కడ చేస్తున్న దీక్షలకే దిక్కులేదు.. ఇక రాష్ట్రమంతటా అమరావతి కొనసాగింపు ఉద్యమం చేస్తారని శివారెడ్డి చెప్పడంతో ప్రెస్‌మీట్‌లోనే నవ్వులు విరిశాయి. ఏదైనా ఉద్యమం సక్సెస్‌ సాధించాంటే ప్రజల స్వచ్ఛంద భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాల్సిందే. లేకపోతే ఇలా ఖాళీ కుర్చీలు, ఎండకు ఎండి, వానకు తడిసే టెంట్లు తప్ప ఏమీ ఉండదు.