టాలీవుడ్ Vs కోలీవుడ్.. చిచ్చుపెట్టిన ‘వారసుడు’ !

0
219

టాలీవుడ్ కోలీవుడ్ అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉన్న బంధానికి సంక్రాంతి సీజన్ ‘చిచ్చు’ పెట్టేలా ఉంది. తమిల్ డబ్బింగ్ మూవీ దండయాత్రను అడ్డుకునేందుకు తెలుగు ప్రొడ్యూసర్స్ చేసిన ప్రయత్నం విఫలయత్నంగా మారింది. సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ స్టార్స్ చిరంజీవి, బాలయ్య బాబు సినిమాలు విడుదల చేయాలని సన్నాహాలు జరుగుతుండగా, డబ్బింగ్ సినిమాలు ఎందుకు తీసుకురావాలని తెలుగు నిర్మాతలు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు ఎట్టిపరిస్థితుల్లో వద్దని తెలుగు నిర్మాతలు అల్టిమేటం జారీ చేశారు. దీనిపై కోలీవుడ్ డైరెక్టర్స్ ఆగ్రహంగా ఉన్నారు. అడ్డుకుంటే తెలుగు మూవీస్ ను తమిళనాడులో విడుదల చేయనియ్యబోమని తెగేసి చెప్తున్నారు.

2023 సంక్రాంతికి సినిమాలు

దీంతో సంక్రాంతికి మూవీస్ రిలీజ్ విషయంలో తమిళ్ డైరెక్టర్స్ వర్సెస్ తెలుగు ప్రొడ్యూసర్స్ మధ్య వార్ మొదలైంది. 2023 సంక్రాంతికి సినిమాలు విడుదల విషయంలో వివాదం రాజుకుంది. తమిళ్ డబ్ మూవీస్ ను ఒప్పుకునేది లేదని టాలీవుడ్ ప్రొడ్యూసర్ మండలి తీసుకున్న నిర్ణయాన్ని డైరెక్టర్ సీమాన్ తప్పుబట్టారు. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’, తమిల్ డబ్ మూవీ ‘వారసుడు’ సంక్రాంతి ముందు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్స్ సమస్య ఏర్పడుతుందని నిర్మాతలు మొరపెట్టుకుంటున్నారు. ఈ మేరకు లేఖ కూడా విడుదల చేశారు.

ప్రాంతీయవాదం తేవడం ఏంటి?

నాన్ తమిళర్ కట్చి అధ్యక్షుడైన సీమాన్ తెలుగు ప్రొడ్యూసర్స్ కు హెచ్చరికలు జారీ చేశారు. వారసుడును అడ్డుకుంటే తెలుగు నిర్మాతలకు తమిళంలో భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఇప్పటి వరకూ తమిళనాడులో బాహుబలి, త్రిపుల్ ఆర్, కేజీఎఫ్ లాంటి చిత్రాలు బాగా కలెక్షన్లు దక్కించుకున్నాయి. ఈ విషయాన్ని టాలీవుడ్ గుర్తించుకోవాలన్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఎదుగుతున్నాం అని చెప్పుకుంటూనే చిత్రాల విడుదలకు ప్రాంతీయవాదం తేవడం ఏంటని సీమాన్ ప్రశ్నిస్తున్నారు.

దిల్ రాజు తమిళ్ ప్రొడ్యూసర్ కాదు

ఇక ‘వారసుడు’ విషయానికి వస్తే ఈ మూవీకి ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి. దిల్ రాజు తమిళ్ ప్రొడ్యూసర్ కాదని సీమాన్ వాదిస్తున్నాడు. కానీ నిర్మాతల మండలి మాత్రం ‘వారసుడు’ డబ్ సినిమాగానే చెప్తున్నారు. సంక్రాంతికి విడుదల చేసేందుకు ఎంతమాత్రం వీలులేదంటున్నారు. దిల్ రాజు వారసుడు విడుదలకు భారీగా థియేటర్స్ ను బుక్ చేసుకోవడం కూడా వివాదానికి కారణం కావచ్చని సినీ అభిమానులు భావిస్తున్నారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డికి అరకొర హాళ్లు కేటాయించి వారసుడికి మాత్రం సింహభాగం కేటాయించినట్లు తెలుస్తోంది. ఏపీలోని ప్రధాన నగరాల్లో సగ భాగం వారసుడికి కేటాయిస్తే వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి మిగతా సగాన్ని పంచుకోనున్నాయి.