అక్కడ కూడా బీజేపీకి హిందూత్వమే ఆసరా

0
492

భారతదేశం లౌకిక దేశమని, ఇక్కడ కులాలు, మతాలకు అతీతంగా రాజకీయలు సాగుతాయనేది ఒకప్పటి మాట. కాంగ్రెస్‌ పార్టీ అప్రతిహతంగా పాలించినంత కాలం లౌకికత్వం బాగానే విరాజిల్లింది. ఇప్పుడు బాగాలేదని కాదు. కానీ బీజేపీ బలపడే కొద్దీ మత రాజకీయాలకు ప్రాధాన్యం పెరుగుతూ వచ్చిన మాట వాస్తవం. గత దశాబ్ధ కాలంగా ఇది మరింత పెరిగింది. వాజ్‌పేయి, అద్వానీ కాలంనాటి బీజేపీ సంప్రదాయ బీజేపీగా కొనసాగింది.

ఎప్పుడైతే మోడీ కేంద్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రధానమంత్రి అయ్యారో నాటి నుంచి సంప్రదాయ మార్గం నుంచి బీజేపీ పక్కా రాజకీయ పార్టీ రూట్‌లోకి వచ్చింది. అంటే నయా బీజేపీ అనమాట. దీనికి రాజకీయాలు, ఎత్తులు, జిత్తులు, పార్టీల మధ్య చిచ్చు, ప్రాంతీయ వాదం వంటి ఫక్తు రాజకీయ విన్యాసాలు బాగా వంట బట్టాయి. అధికారమే అంతిమ లక్ష్యంగా ప్రయాణిస్తున్న బీజేపీ ప్రస్తుతం నమ్ముకున్నది హిందుత్వ వాదమనేది అందరికీ తెలిసిందే.

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో హిందూత్వ అండతో చొచ్చుకు పోతున్న బీజేపీ ఈ సంవత్సరం పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఇందుకోసం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా బెంగాల్‌లో జోరుగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే తృణమూల్‌ కాంగ్రెస్‌లో కీలక నేతలకు గాలం వేసి లాగేసుకుంది.

అంతటితో ఊరుకోకుండా గత రెండు పర్యాయాలు తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలిచిన ముస్లిం ఓట్లను చీల్చాలని కొత్త ఎత్తుగడ వేసిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందు కోసం ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీని రంగంలోకి దింపినట్లుగా అనుమానిస్తున్నారు. ఇటీవల జరిగిన బీహార్‌ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేసి ఐదు సీట్లను గెలుచుకుంది. పలు స్థానాల్లో ముస్లిం ఓటు బ్యాంకును తనవైపు తిప్పు కోవడం ద్వారా గెలుపు ఓటముల్లో కీలక పాత్ర పోషించింది.

ఇక్కడ ఎంఐఎం పోటీ చేయడం వెనుక బీజేపీ ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూడా పశ్చిమ బెంగాల్‌లో 30 శాతానికి పైగా ఉన్న ముస్లిం ఓట్లను ఛీల్చడం ద్వారా మమతకు వారిని దూరం చేయాని బీజేపీ ప్లాన్‌ చేస్తోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ వర్గాలు విమర్శిస్తున్నాయి. బీజేపీ హిందూత్వ అజెండాతో బెంగాల్‌ రాజకీయాల్లో తనదైన రాజకీయానికి తెరలేపుతోంది.