జగమంతా రామమయం

0
105
sri ram

శతాబ్దాలుగా ఎదురు చూస్తున్న స్వప్నం సాకారమైంది. ఎన్నో చిక్కుముళ్లు, సమస్యలు, తరాలు దాటుకుని వచ్చిన పీటముడి వీడిపోయింది. అఖండ భారతం అంతా రామమయంగా మారిపోయింది.

కొద్ది సేపటి క్రితం అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ ఆకాశాన్నంటిన సంబరంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ రామునికి ప్రత్యేక పూజలు నిర్వహించి దేశం గర్వించే ఓ మహోన్నత ఘట్టానికి తెర తీశారు. దేశం నలుమూలల నుంచి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అయోధ్య బాటపట్టారు.

sri ram

అయోధ్య పరిసరాలు అన్నీ రామనామ స్మరణతో మారుమోగుతున్నాయి. మధ్యాహ్నం 12.29 నిముషాలకు ప్రధాని చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించడంతో దాదాపు 5 శతాబ్దాలుగా హిందు, ముస్లింల మధ్య ఘర్షణకు కారణమైన వివాదాస్పద అంశం ఎట్టకేలకు సమసిపోయింది.

ఈ ప్రాణ ప్రతిష్ట కోసం గత 11 రోజులుగా ఉపవాసం ఉంటూ వచ్చిన ప్రధాని ఈరోజు శ్రీరాముడికి పట్టు వస్త్రాలను సమర్పించడంతో ఆయన దీక్ష ముగిసినట్టు అయింది. వేదమంత్రోచ్ఛారణల మధ్య అయోధ్యలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని దేశంలోని పల్లె, పట్టణాలు తేడా లేకుండా ప్రతి ఊరిలోని రామాలయాల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా అనేక ధార్మిక కార్యక్రమాలు, అన్న సంతర్పణలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి అనేకమంది రాజకీయ, సినిమా రంగాలకు చెందిన వ్యక్తులు అయోధ్యకు చేరుకుని ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

వీరితో పాటు అనేకమంది హిందూ సంఘాల నాయకులు, ధార్మిక పరిషత్‌లకు చెందిన వారు, వివిధ పీఠాలకు, మఠాలకు చెందిన పెద్దలు కూడా భారీ ఎత్తున అయోధ్యకు తరలి వెళ్లారు. ఇలా దేశం నలుమూలల నుంచి వచ్చిన వారితో అయోధ్య పులకించిపోతోంది. లక్షలాదిగా తరలి వస్తున్న వారి కోసం ప్రతి చోటా అన్న సంతర్పణ, ప్రసాద వితరణ, తాగునీరు, ఇతర సౌకర్యాలను భారీ ఎత్తున చేపట్టింది రామమందిర ట్రస్ట్‌.