షర్మిళ షురూ చేసేసింది

0
96
ys sharmila

ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈనాడే ఎదురౌతుంటే.. ఇన్నినాళ్లు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పోతుంటే.. ఇంకా తెలవారదేమి.. ఈ చీకటి విడిపోదేమి.. అంటూ సాగిన తెలుగు పాటను గుర్తుకు తెస్తోంది వై.యస్‌. షర్మిళ రాజకీయ జీవితం.

తండ్రి మరణానంతరం వారసత్వ రాజకీయాన్ని గంపగుత్తగా సోదరుడు జగన్‌రెడ్డి పట్టుకుపోయి.. అందుకు సహకరించిన తనకు వీసమెత్తు విలువ కూడా ఇవ్వక అవమానించడం.. ఆనక ఆమె వైఎస్సార్‌టీపీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అవ్వాలని అనుకోవడం.. అది సాధ్యం కాదని తెలిసి కాంగ్రెస్‌ పార్టీలో కలిపేయడం.. అదే కాంగ్రెస్‌ పార్టీ తరపున సీఎం అభ్యర్ధిగా ఏపీసీసీకి అధ్యక్షురాలు కావడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి.

ఆదివారం విజయవాడలో భారీ జన సందోహం మధ్య, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుల మధ్య బాధ్యతలను స్వీకరించారు షర్మిళ. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి మొదలైన కాన్వాయ్‌ అట్టహాసంగా ఆహ్వానం ఫంక్షన్‌ హాల్‌ వరకు చేరింది.

ys sharmila

దారిలో పోలీసులు ఆమె కాన్వాయ్‌ని అడ్డుకోవడం, ఆపై షర్మిళ తీవ్ర నిరసనతో పోలీసులు వెనక్కు తగ్గడం షర్మిళ దూకుడు ఏ రేంజ్‌లో ఉండబోతోందో చెప్పకనే చెప్పింది. పీసీసీ బాధ్యతల స్వీకరణ అనంతరం ఆమె మాట్లాడుతూ సోదరుడు జగన్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు.

అభివృద్ధి అనేది లేదు గానీ, దళితులపై దాడులు, ఇసుక పేరుతో, మద్యం, మైనింగ్‌ పేరుతో వేల కోట్లు దోచుకోవడం, దాచుకోవడం మాత్రం బాగా సాగుతోందని, జగన్‌రెడ్డి పాలనలో ఆంధ్రరాష్ట్రం అధోగతిపాలైందని అన్నారు.

అప్పులు మాత్రం 10 లక్షల కోట్లకు చేరిందని, రాజధాని కూడా లేని రాష్ట్రంగా మిగిలిపోయిందని, గత పదేళ్లలో పది పరిశ్రమలు అయినా వచ్చాయా? అంటూ ఏకి పారేశారే. తాజాగా సోమవారం విశాఖపట్నంలో కాంగ్రెస్‌ తరపున నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రపై దాడి జరిగిన నేపథ్యంలో ఈ నిరసనకు పిలుపునిచ్చారు. మొత్తానికి బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే నిరసనలకు దిగడం ద్వారా షర్మిళ తనకు పార్టీ అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితోనే నిర్వహిస్తున్నట్లు భావించాలి. రాబోయే రోజుల్లో ఈ దూకుడు ఇలాగే ఉంటుందో? లేదో చూడాలి.