జగన్‌ ఆ ఓటు బ్యాంకే కాంగ్రెస్‌ టార్గెట్‌

0
210

అధికారం అంటే వీజీ కాదు బాసూ అంటుంటారు. అవును మరి ఐదేళ్లు ప్రజల నెత్తిన కూర్చుని అనుభవించే రాజభోగానికి ఆ మాత్రం కష్టపడాలి మరి. అందుకే ప్రతి ఓటు, ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి ప్రాంతం.. ఇలా ప్రతి ప్రతిలూ కీలకమే. మన వెనుక ఏఏ వర్గాలు ఉన్నాయి అనేదానికన్నా.. మన రాజకీయ శత్రువు వెనుక ఎవరున్నారు అనేదే ముఖ్యం.

వారిని మన వైపు తీసుకురావడంలో ఎంత సఫలం అయితే అంత మంచిది. నిన్నటి వరకూ వైసీపీ వర్సెస్‌ టీడీపీ`జనసేన కూటమిగా ద్విముఖ పోరుకు సన్నాహాలు జరిగాయి. అయితే తాజాగా కాంగ్రెస్‌ పార్టీ వై.యస్‌. షర్మిళను ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమించడం, ఆమె పగ్గాలు చేపట్టడం, ముఖ్యమంత్రి, తన సోదరుడిపై విమర్శల బాణాలు ఎక్కు పెట్టడంతో పోటీ త్రిముఖం అయి కూర్చుంది.

jagan ap politics

జగన్‌ ఓటు బ్యాంకులో మేజర్‌ షేర్‌ ఉన్న క్రిస్టియన్‌లను ఆయన నుంచి తమవైపుకు తిప్పుకోవటానికి కాంగ్రెస్‌ టార్గెట్‌ ఫిక్స్‌ చేసింది. ఈ టార్గెట్‌ ప్రకారమే షర్మిళ అడుగులు పడనున్నట్లు నిన్నటి షర్మిళ విమర్శలతో అర్ధమైపోతోంది. ‘‘క్రైస్తవుడైన జగన్‌ మోహన్‌రెడ్డి మణిపూర్‌లో 2 వేల చర్చిలను ధ్వంసం చేస్తే, 60 వేల మందిని నిరాశ్రయులను చేస్తే ఎందుకు స్పందించలేదు.

ఒక్కసారి కూడా ఆ ఘటనపై మాట్లాడలేదు. కనీసం ఒక మనిషిగా కూడా స్పందించలేదు. క్రైస్తవులు మీ దృష్టిలో మనుషులు కారా? వారికి మనసు ఉండదా? వేలమంది అక్కడ చచ్చిపోతున్నా మీరు బీజేపీకి మద్దతు ఇవ్వడం యావత్‌ రాష్ట్రం గమనిస్తోంది’’ అంటూ ఘాటుగా విమర్శించారు.

దీన్ని బట్టి జగన్‌కు గత ఎన్నికల్లో వెన్న దన్నుగా ఉన్న క్రైస్తవ ఓటు బ్యాంకును కాంగ్రెస్‌ టార్గెట్‌ చేసినట్లుగా భావించాలి. ఇందు కోసమే క్రైస్తవురాలైన షర్మిళకు ఏపీ పార్టీ పగ్గాలు అప్పగించారని, దీనికి తోడు షర్మిళ భర్త అనిల్‌కు ఏపీలోని మెజార్టీ క్రిస్టియన్‌ సంఘాలతోను, వ్యక్తులతోను మంచి సంబంధాలు ఉన్నాయని అనుమానమాట.

ఆయన ద్వారా ఆ వర్గం వారి ఓటు బ్యాంకును కొల్లగొట్టడం వల్ల జగన్‌కు ఓటమి పాలు కావడం ఖాయమని, తద్వారా ఏపీలో కాంగ్రెస్‌ బలపడటం ఒక ప్లస్‌ కాగా, రాజకీయంగా కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసిన వ్యక్తిపై పగ తీర్చుకున్నట్లు కూడా అవుతుందని కాంగ్రెస్‌ భావిస్తోందన్నమాట.