ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమలో టాక్ ఆఫ్ ది పర్సన్ రియల్ హీరో సోనూసూద్. లాక్‌డౌన్ సందర్భంగా ప్రజల బాధలు కళ్లారా చూసి కరిగిపోయి… తన ఆస్తు తరిగి పోయినా నో కాంప్రమైజ్ అంటూ ముందుకు దూసుకు వెళ్తున్నారు సోనూ. లాక్‌డౌన్‌లో ప్రజలు కాలినడకన తమ స్వంత ప్రాంతాలకు వెళుతున్న వైనం ఆయన్ను ఎంతగానో కలచి వేసింది. అందుకే తన స్వంత ఖర్చుతో బస్సులు, రైళ్లు, విమానాలు, కార్లు ఇలా అవసరమైన వాహనాలను ఏర్పాటు చేసి జనాలను వారి వారి గమ్యస్థానాలకు చేర్చారు సోనూ. అంతటితో ఆగకుండా తన సహాయ కార్యక్రమాలకు మరింత దూకుడు పెంచారు.
రైతులకు ట్రాక్టర్లు, విద్యార్థులకు లాప్‌టాప్‌లు, కాలేజీ ఫీజు, స్వయం ఉపాధి అవసరమైన ఆర్థిక సాయం ఇలా చెప్పుకుంటూ పోతే సోనూసూద్ సాయం లిస్ట్ చాంతాడంత ఉంటుంది. తాజాగా ఈ లిస్ట్‌లోకి స్మార్ట్ ఫోన్‌లు వచ్చి చేరాయి. సోనూసూద్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ సినిమా ‘ఆచార్య’లో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ శివారులో వేసిన భారీ సెట్‌లో నిర్విరామంగా జరుగుతోంది. ఈ షూటింగ్‌లో ఉన్న సోనూసూద్ ‘ఆచార్య’ సినిమాకు పనిచేస్తున్న యూనిట్ సభ్యులకు 100 స్మార్ట్ ఫోన్‌లను పంపిణీ చేశారు.
ఇటీవల యూనిట్‌లో ఓ వ్యక్తి సోనూసూద్ దగ్గరకు వెళ్లి సార్ మీతో ఓ ఫొటో దిగాలని ఉంది అన్నాడట. సరే అని స్టడీగా నుంచున్న సోనూకు అతను దూరంగా వెళ్లి ఓ వ్యక్తిని స్మార్ట్ ఫోన్ అడిగి తీసుకు రావడం కనిపించింది. ‘‘అదేంటి నీకు స్మార్ట్‌ఫోన్ లేదా?’’ అని అడిగిన సోనూతో అతను… ‘‘లాక్‌డౌన్‌లో షూటింగ్‌లు లేక ఫోన్ అమ్మేశాను సార్’’ అని చెప్పాడట. ఆ క్షణమే యూనిట్‌లో పనిచేసే కింది స్థాయి కార్మికులు అందరికీ స్మార్ట్ ఫోన్‌లు గిఫ్ట్‌గా ఇవ్వాని నిర్ణయించేసుకున్నారట సోనూ సూద్. బుధవారం వాటిని పంపిణీ చేశారు.