అలా కెప్టెన్‌గా మారారు..

0
197
So he Became the Captain Vijayraju Alagar Swamy alias Vijaykanth

విజయ్‌రాజు అళగర్‌ స్వామి అలియాస్‌ విజయ్‌కాంత్‌… తమిళ సినీరంగంలో చెరగని ముద్ర వేసిన నటుల్లో ఒకరు. మాస్‌, యాక్షన్‌ చిత్రాలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి.

గురువారం అకస్మాత్తుగా కన్నుమూసిన ఆయనకు యావత్‌ చిత్ర పరిశ్రమ నివాళి అర్పిస్తోంది. మన తెలుగు పరిశ్రమ నుంచి చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, రవితేజ, మోహన్‌బాబు వంటి ప్రముఖులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. విజయ్‌కాంత్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

So he Became the Captain Vijayraju Alagar Swamy alias Vijaykanth

1952 ఆగష్ట్‌ 25న మధురైలో జన్మించిన ఆయన తన 27 ఏళ్ల వయస్సులో ‘ఇనుక్కుమ్‌ ఇలామై’ చిత్రం ద్వారా నటుడిగా కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత 150 చిత్రాలలో నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఆయన కెరీర్‌లో ఎక్కువగా యాక్షన్‌ చిత్రాలకు పెట్టింది పేరు.

విజయ్‌ కాంత్‌ పోలీస్‌ ఆపీసర్‌గా ఆర్‌.కె. సెల్వమణి దర్శకత్వంలో వీరప్పన్‌ స్టోరీతో వచ్చిన ‘కెప్టెన్‌ ప్రభాకర్‌’ సూపర్‌డూపర్‌హిట్‌ అవ్వడంతో అప్పటి నుండి ఆయన్ను అందరూ కెప్టెని పిలవడం మొదలు పెట్టారు.

ఆయన దాదాపు 20కి పైగా చిత్రాల్లో పోలీస్‌ ఆఫీసర్‌గా నటించారు. డైరెక్ట్‌గా ఏ తెలుగు చిత్రంలోనూ నటించకపోయినా ఆయన నటించిన చాలా తమిళ చిత్రాలు తెలుగులో విడుదలై విజయం సాధించాయి.

విశేషమైన అభిమానగణం ఉన్న కెప్టెన్‌ సినిమాలలో తనను ఆదరించిన ప్రేక్షకులరుణం తీర్చుకోవడం కోసం ‘డీఎండీకే’ పార్టీని స్థాపించారు.

ప్రారంభంలో ఆయన ఒక్కరే ఆ పార్టీ గుర్తు మీద గెలిచారు. తరువాత జరిగిన ఎన్నికల్లో 18 మందిని గెలిపించుకుని తమిళ రాజకీయాల్లో తనదైన మార్క్‌ను వేశారు.

ఆ తర్వాత రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజల పక్షాన నిలబడటానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. గెలుపు ఓటములు వస్తాయి.. పోతాయి.. కానీ నన్ను ఇంత వాడిని చేసిన ప్రజలకు నేను అండగా ఉండకపోతే ఎలా అనేవారు.

నటుడిగానే కాక, వ్యక్తిగా కూడా అందరికీ ఇష్టుడైన ఆయన మరణంతో కెప్టెన్‌ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమిళనాడు వ్యాప్తంగా ఆయన చిత్ర పటాలను పెట్టి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.