గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా సమ్మక్క`సారలమ్మను అత్యంత భక్తి ప్రపత్తులతో కొలుస్తారు. ఈసారి 2024 ఫిబ్రవరి 21 నుంచి 24 వరకూ ఈ మహోత్సవం జరగనుంది.
ఇందుకోసం తెలంగాణ రాష్ట్రంతో పాటు ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌లతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు వన దేవతలను దర్శించుకోవటానికి బారులు తీరుతారు.
మన దేశంలో కుంభమేళా తర్వాత కోట్లాదిగా భక్తులు తరలివస్తారు. ఇంతమందికి సౌకర్యాలు కల్పించడం అనేది ప్రభుత్వానికి కత్తిమీద సాములాంటిది.
చాణక్యుడి నీతి: విజయం సాధించాలంటే ఇలా చేయాలి!…
అయితే ఈసారి ఈ జాతరను ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిపించడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి నుంచే చర్యలు చేపట్టింది. జాతర నిర్వహణకు సంబంధించి మంత్రి సీతక్కకు బాధ్యతలు అప్పగించారు.
సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు జిల్లా, ములుగు నియోజకవర్గంలోని తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామానికి కొద్ది దూరంలో ఈ సమ్మక్క`సారలమ్మల గద్దెలు ఉంటాయి. కాబట్టి అటు స్థానికి శాసనసభ్యురాలిగా, గిరిజన బిడ్డగా, జిల్లాకు చెందిన మంత్రిగా సీతక్కకు గురుతర బాధ్యత ఉండడంతో ఆమె ఇప్పటికే జాతర ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.
గత ప్రభుత్వాల హయాంలో తాము సంతృప్తి చెందే స్థాయిలో ఈ వేడుకలను నిర్వహించలేదని గిరిజనుల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సంప్రదాయ రీతిలో జరిగే ఈ వైభవోపేత జాతర తమ మనుగడకు జీవనాధారం, జీవ ఆధారంగా భావించే గిరిజనులు సుదూర ప్రాంతాల నుంచి మేడారం చేరుకుంటారు.
వీరికి వసతి సౌకర్యాలు, రవాణా, రహదారి, తాగునీరు వంటి కీలక అంశాలపై ఇప్పటికే అధికారులు తగు చర్యలు చేపట్టారు. ఇందుకోసం భారీ స్థాయిలో నిధులను విడుదల చేయటానికి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీంతో ఈసారి మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మంత్రి సీతక్కకు ఈ జాతరను దిగ్విజయం చేయడం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది అని చెప్పవచ్చు.