
అక్కినేని నాగార్జున నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ఈసారి హిట్ కొట్టాల్సిందే అనే పరిస్థితిలో ఉన్నాడు. గత మూడు సంవత్సరాల్లో ‘బంగార్రాజు’ తర్వాత ఆయనకు మరే హిట్ సినిమాలు లేకపోవడంతో కెరీర్ డైలమాలో పడింది. ‘థ్యాంక్యూ’ భారీ ఫ్లాప్ కాగా, బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ‘లాల్ సింగ్ చద్దా’ కూడా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇక చాలా ఆశలు పెట్టుకున్న ‘కస్టడీ’ కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.
ఇలాంటి తరుణంలో చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘తండేల్’పై భారీ అంచనాలున్నాయి. ‘కార్తికేయ 2’తో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చందూ ఈసారి కూడా ఓ మాస్, ఎమోషనల్ డ్రామాతో వచ్చాడు. మత్స్యకారుల కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సముద్రంలో చేపలు పట్టే కొంత మంది భారతీయులు అనుకోకుండా పాకిస్థాన్ చేతిలో చిక్కడం, అక్కడ జైళ్లలో పడే ఇబ్బందులు, తిరిగి స్వదేశానికి వచ్చేందుకు వారు చేసే పోరాటం అనే ఇతివృత్తంతో రూపొందింది.
ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించగా, బడ్జెట్ దాదాపు రూ. 75 కోట్ల వరకు ఖర్చయిందని సమాచారం. ఇది నాగచైతన్య కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ. ఇందులో చైతన్య సరసన సాయి పల్లవి నటించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ప్రకాశ్ బెలవాడి, కరుణాకరన్, కల్పలత, పర్వతీశం, మహేశ్ అచంట తదితరులు కీలక పాత్రలు పోషించారు.
సినిమా టీజర్, ట్రైలర్, పోస్టర్లు చూసిన ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. దీంతో ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగిందని సమాచారం. థియేట్రికల్ బిజినెస్ పరంగా చూస్తే నైజాంలో రూ.7 కోట్లు, సీడెడ్‌లో రూ.3.5 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.4 కోట్లు, ఓవర్సీస్లో రూ.5 కోట్లు వసూలు చేసి, మొత్తం రూ.31 కోట్ల బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్ పెట్టిన సినిమాకు ఈ థియేట్రికల్ బిజినెస్ తక్కువగానే ఉందని విశ్లేషకులు అంటున్నారు.
కానీ, నాన్-థియేట్రికల్ రైట్స్ మాత్రం భారీగా అమ్ముడయ్యాయి. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ హక్కులను రూ.40 కోట్లకు కొనుగోలు చేయగా, హిందీ డబ్బింగ్ రైట్స్ రూ.8 కోట్లు, ఆడియో రైట్స్ రూ.7 కోట్లు, శాటిలైట్ రైట్స్ రూ.10 కోట్లు కలిపి మొత్తం రూ.65 కోట్ల బిజినెస్ జరిగిందట. ఈ రెండు కలిపి దాదాపు రూ.100 కోట్లకు చేరుకున్నాయి. దీన్ని బట్టి నిర్మాతలకు మంచి లాభం వచ్చిందని అనుకోవచ్చు.
ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 7న విడుదలవుతున్న ‘తండేల్’కు అమెరికా, కెనడాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై నాలుగు రోజుల ముందుగానే మంచి హైప్ కనిపిస్తోంది. అక్కడ 128 సెంటర్లలో 252 షోలకు గాను 2,579 టికెట్లు అమ్ముడై, 37,490 డాలర్ల గ్రాస్ వసూలు అయ్యింది. కెనడాలో 12 సెంటర్లలో 14 షోలకు గాను 64 టికెట్లు అమ్ముడై 1,200 కెనడా డాలర్లు వచ్చాయి.
మొత్తం కలిపి భారత కరెన్సీలో రూ.34 లక్షలకు పైగా ముందస్తు వసూళ్లు వచ్చాయి. ఇంకా ప్రీమియర్స్‌కు మూడు రోజులు ఉండటంతో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా నాగచైతన్య కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందా? బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.