
నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు లభించిన సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులంతా కలిసి ఒక ప్రత్యేక వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో కుటుంబసభ్యులతో పాటు బాలకృష్ణతో కలిసి పనిచేసిన పలువురు దర్శకులు కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో బాలకృష్ణ ఇచ్చిన స్పీచ్ అందర్నీ ఆకట్టుకుంది. కుటుంబ సభ్యులు బాలయ్యతో సరదాగా ముచ్చటిస్తూ కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు.
బాలకృష్ణ సోదరి పురందేశ్వరి ఒక సందర్భంలో, “ఉదయం 7:30కి ఫోన్ చేస్తే ఎత్తవా?” అని సరదాగా ప్రశ్నించగా, బాలయ్య తనదైన శైలిలో సమాధానం చెప్పారు. “పూజలో ఉన్నా” అని చెప్పడం వెనుక ఉన్న కారణాన్ని ఆసక్తికరంగా వివరిస్తూ, సన్యాసి సంసారం గురించి మాట్లాడారు అని అన్నారు. ఈ సమాధానం అక్కడ ఉన్నవారిని నవ్వుల్లో ముంచెత్తింది. ఇక, మరో సోదరి నారా భువనేశ్వరి బాలకృష్ణ నటించిన సినిమాల్లో అతనికి ఇష్టమైన కథానాయిక ఎవరో ప్రశ్నించగా, బాలయ్య కాస్త తడబడిపోయారు. అప్పుడు అనిల్ రావిపూడి సాయం చేస్తూ “సిమ్రాన్” అని చెప్పగా, బాలకృష్ణ కూడా అదే పేరు చెప్పారు. కానీ, భువనేశ్వరి మాత్రం ఒక్కరిని కాకుండా ముగ్గురి పేర్లు చెప్పాలని కోరారు. దీంతో బాలయ్య మొదట విజయశాంతి, రెండోగా రమ్యకృష్ణ, మూడోగా సిమ్రాన్ పేర్లు చెప్పారు. దీంతో, అనిల్ రావిపూడి సరదాగా “మీ లిస్ట్ లో సిమ్రాన్ థర్డ్ ప్లేస్” అని వ్యాఖ్యానించడంతో అక్కడ నవ్వులు విరబూశాయి.
ఈ వేడుకలో దర్శకుడు గోపీచంద్ మలినేనికి బాలకృష్ణ ముద్దు ఇస్తూ, “మన సినిమా వస్తుందని చెప్పు” అంటూ సరదాగా అనడంతో అక్కడున్నవారు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. బాలయ్య తనకు లభించిన పద్మభూషణ్ అవార్డ్ తనలో మరింత ఉత్సాహాన్ని నింపిందని, రాబోయే రోజుల్లో ఇంకా మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్టు చెప్పారు.
ఇటీవలే ‘డాకు మహారాజ్’తో బాలయ్య హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన మళ్లీ ‘అఖండ 2’ కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత గోపీచంద్ మలినేనితో మరో సినిమా చేసే అవకాశాలున్నాయి. ఇక బాలకృష్ణ తన దర్శకత్వంలో ‘ఆదిత్య 369’కి సీక్వెల్గా ‘ఆదిత్య 999’ తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినిమా కూడా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.
ఈ కార్యక్రమంలో బాలకృష్ణ నటించిన, నటించబోయే సినిమాల గురించి చర్చించడంతో పాటు, కుటుంబ సభ్యులు, అతని తోటి నటీనటులు, దర్శకులు అందరూ కలిసి ఈ ప్రత్యేక వేడుకను గ్రాండ్గా జరిపారు. బాలకృష్ణ ఎనర్జీ చూస్తుంటే నందమూరి అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు.