దేశంలో మరే రాష్ట్రంలోనూ కనిపించని నిఖార్సయిన జర్నలిజం మనకు ఒక్క తెలుగులోనే కనిపిస్తుంది. నిఖార్సు అంటే ప్రజల కోసం కాదండోయ్.. తాము నమ్ముకున్న పార్టీ కోసం.. నాయకుడి కోసం నిఖార్సుగా పనిచేస్తాయి అన్నమాట.
ఈ జాఢ్యానికి ఆధ్యం పోసింది ఈనాడు దినపత్రిక అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే తాను నమ్ముకున్న పార్టీకి ఓ 20 శాతమో 30 శాతమో అనుకూలంగా వార్తలు రాసినా.. మిగిలిన శాతం మాత్రం బేలన్స్‌డ్ వార్తలకు ప్రాధాన్యం ఇస్తుంది ఈనాడు.
ఇది ఇప్పటికీ కొనసాగుతూ ఉండడం మెచ్చుకోవాలి. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక 2004లో వేమూరి రాధాకృష్ణ చేతిలోకి వచ్చిన నాటి నుండి అది ఫక్తు తెలుగుదేశం పార్టీ పేపర్‌గా ముద్ర పడిరది. దీనికి ఆర్కే కూడా ఏమీ ఫీలవడు.
అయితే ఫక్తు తెలుగుదేశం పార్టీ పత్రికే అయినా.. సంచలన కథనాల విషయంలో ఆంధ్రజ్యోతి పేపర్‌కు గానీ.. ఏబీఎన్ ఛానల్‌కు గానీ సాటి మరోటి లేదనే చెప్పాలి. ఇలాంటి సంచలనాల్లో భాగంగా ఈరోజు ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది.
ఇందులో నిజమెంత ఉందో పక్కన పెడితే.. ఆంధ్రజ్యోతి రాసింది కాబట్టి ఎంతోకొంత ఉండే ఉంటుంది. వివరాల్లోకి వెళితే… 2021లో ఏపీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్‌మోహన్‌రెడ్డి ఏపీకి చెందిన ఒక కీలక న్యాయమూర్తికి వజ్రాలు పొదిగిన రెండు కోట్ల రూపాయల ఖరీదు చేసే వాచీని బహుమతిగా ఇవ్వజూపారట.
దీనిని టీటీడీ ఈవోగా పనిచేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి భక్తుడు ధర్మారెడ్డి, ఎంపీ ప్రభాకర్‌రెడ్డిలు సదరు జడ్జి గారికి ఇవ్వబోతే ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసి, దానిని వారి ముఖానే విసిరి కొట్టారనేది సారాంశం.
అలాగే వీరిద్దరిపై అప్పుడే సుప్రీంకోర్టుకు కూడా ఫిర్యాదు చేశారట. ఆలస్యంగా వెలుగు చూసిన ఆ ఘటన నాడు ఉత్తరాదిలో ఆ జడ్జి గారికి సంబంధించిన కుటుంబ సభ్యుడి వివాహం జరుగుతుండగా అక్కడ ఈ జడ్జిగారు బస చేసిన గెస్ట్‌హౌస్‌కు వెళ్లిన వీరు ఈ గిఫ్ట్ తతంగం నడిపినట్లు ఆంధ్రజ్యోతి కథనాన్ని బట్టి తెలుస్తోంది.
ప్రస్తుతం రాజకీయ వర్గాలతో పాటు న్యాయ వర్గాలలో కూడా ఈ వార్తపై చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో జ్యోతిలో వచ్చిన కథనాల వెనుక నిజాలు ఉండడంతో ఈ వార్తకు కూడా ప్రాధాన్యత ఏర్పడిరది.