మన జాతిపిత గాంధీ కాదు.. తమిళనాడు గవర్నర్‌

0
542
rn ravi

ఏ దేశంలో లేని చిత్ర విచిత్రాలు అన్నీ మన దేశంలోనే కనిపిస్తాయి. ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేసుకోవటానికి రాజ్యాంగం అనేదాన్ని ఒకటి రాసుకున్నామని, దాన్ని అనుసరించే మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటలు ఉండాలనే విషయమే మర్చిపోయి, ఒళ్లు తెలియకుండా మాట్లాడుతుంటారు.

సామాన్యులు, చదువులేని వాళ్లు అలా మాట్లాడారు అంటే అర్ధం ఉంటుంది. కానీ ఉన్నతమైన చదివిన వారు, ఉన్నత పదవుల్లో ఉన్నవారు.. అందులోనూ రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు కూడా ఇలా బరితెగించి మాట్లాడటం ఎలా తీసుకోవాలో అర్ధం కాదు.

తాజాగా తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నేతాజా సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి కార్యక్రమాన్ని చెన్నైలోని అడయార్‌లో ఉన్న అన్నా యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఛాన్సలర్‌ హోదాలో గవర్నర్‌ రవి హాజరయ్యారు.

rn ravi

ఈ సందర్భంగా ఆయన ‘‘మన దేశానికి అసలై జాతిపిత నేతాజీ సుభాష్‌ చంద్రబోసే. ఎందుకంటే గాంధీజీ ఆధ్వర్యంలో జరిగిన పోరాటాల వల్ల మనకు స్వాతంత్య్రం సిద్ధించలేదు. నేతాజీ స్థాపించిన ఇండియన్‌ నేషనల్‌ ఫోర్స్‌ చేసిన పోరాటాల వల్లే మనకు స్వాతంత్య్రం వచ్చింది.

ఈ ఫోర్స్‌ తెల్లదొరల పాలిట సింహస్వప్నం అయ్యింది. గతంలో కూడా బ్రిటన్‌ ప్రధాని అట్లీ భారతదేశంలో జాతీయ కాంగ్రెస్‌ పోరాటల వల్ల ఆంగ్లేయులు ఆ దేశం విడిచి వెళ్లలేదు అని అన్నారు. కేవలం ముస్లిం నేతల అభీష్టం మేరకే దేశ విభజన జరిగిందని కూడా ఆయన అన్నారని గవర్నర్‌ అన్నారు.

అంతేకాక గవర్నర్‌ రవి తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఓ సందేశంలో ‘‘బ్రిటీష్‌ సేనలను వీరోచితంగా ఎదురొడ్డి పోరాడి, వారి సైనిక బలానికి సవాల్‌ విసురుతూ భారత ఆర్మీకి నేతృత్వం వహించిన విప్లవ వీరుడు, మహా దీర్ఘదర్శి సుభాష్‌ చంద్రబోస్‌ను దేశమంతా స్మరించుకోవాలి’’ అని పేర్కొన్నారు.

భారత స్వాతంత్య్ర పోరాటంలో అతివాదులు, మితవాదులు అనే రెండు రకాల వేదికలను ఏర్పాటు చేసి వీరోచితంగా పోరాటం చేసిన మాట వాస్తవం. అయితే స్వాతంత్య్రం సిద్ధించడం తమ వల్లే జరిగింది అంటే.. కాదు తమ పోరాటాల ఫలితమే అంటూ ఇరు వేదికలకు చెందిన నాయకుల అనుచరులు, అభిమానులు పేర్కొంటూ ఉంటారు.

అయితే ఏకంగా రాజ్యాంగ బద్ధమైన గవర్నర్‌ పదవిలో ఉంటూ గాంధీజీని ఈ దేశమంతా జాతిపితగా కొనియాడుతుంటే ఇప్పుడు ఈయన ఇలా మాట్లాడటం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని మేధావులు అభిప్రాయ పడుతున్నారు.