నిజామాబాద్‌ ఎంపీ బరిలో దిల్‌ రాజు?

0
773
dil-raju

రాజకీయ రంగానికి, సినిమా రంగానికి ఉన్న అవినాభావ సంబంధం అందరికీ తెలిసిందే. ఈ సినిమా`రాజకీయ మైత్రికి గట్టి పునాదులు వేసింది తమిళనాడు రాజకీయమే. నాడు అగ్రహీరో ఎంజీఆర్‌ సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి, పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారు.

ఆ తర్వాత సినిమా రంగంలో అగ్ర రచయితగా వెలుగొందిన కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే అగ్ర కథానాయిక జయలలిత కూడా ముఖ్యమంత్రి అవ్వడం విశేషం.

ఈ స్ఫూర్తితోనే 1982లో తెలుగునాట అగ్ర కథానాయకుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల కాలంలోనే దశాబ్దాలు పాలిస్తున్న కాంగ్రెస్‌ పార్టీని కూకటి వేళ్ళతో సహా పెకలించి వేశారు.

dil-raju

అన్నగారి స్పూర్తితో అనేక మంది తెలుగు తారలు రాజకీయ రంగ ప్రవేశం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కోవలోనే కృష్ణ, జగ్గయ్య, జమున, చిరంజీవి… ఇలా అనేక మంది చిన్న, పెద్ద తారలు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న వారే.

తాజాగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన స్వస్థలమైన నిజామాబాద్‌ జిల్లాలోని నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారట. అది కూడా అధికార కాంగ్రెస్‌ పార్టీ నుంచి కావడం విశేషం.

గతంలో కూడా దిల్‌రాజు రాజకీయ ప్రవేశం గురించి అనేసార్లు వార్తలు వచ్చినప్పటికీ ఈసారి అది కార్యరూపం దాల్చబోతోందని తెలుస్తోంది.

ఈ సంవత్సరం ఏప్రిల్‌లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థులను వడపోత పోస్తోంది. ఈ క్రమంలో నిజాబామాద్‌ నుంచి దిల్‌రాజు పేరు ముందు వరుసలో ఉందట. గతంలో ఈ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మధుయాష్కి గౌడ్‌ రెండుసార్లు విజయం సాధించారు.

మొన్నటి ఎన్నికల్లో మధుయాష్కీ ఎల్‌.బి. నగర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. ఒకవేళ దిల్‌రాజును కాదనుకుంటే మధుయాష్కీకి మళ్లీ పార్లమెంట్‌కు అవకాశం దక్కవచ్చు.

అటు బీఆర్‌ఎస్‌, ఇటు బీజేపీలు కూడా నిజామాబాద్‌ పార్లమెంట్‌లో మంచి పట్టు కలిగి ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సిట్టింగ్‌గా ఉన్నారు.

ఇదే స్థానం నుంచి అంతకు ముందు కేసీఆర్‌ కుమార్తె కవిత ఎంపీగా పనిచేశారు. చూద్దాం సినిమా రంగంలో అగ్ర నిర్మాతగా ఎదిగిన దిల్‌ రాజు రాజకీయాల్లో ఏ మేరకు సక్సెస్‌ అవుతారో.