మరో వివాదంతో వార్తల్లోకి యాదాద్రి టెంపుల్‌

0
545
yadadri

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం… మన దేశంలో ముఖ్యంగా తెలుగునాట ఎంతో మహిమాన్విత నారసింహ క్షేత్రం. నల్లగొండ జిల్లా యాదగిరి గుట్టపై వేంచేసి ఉన్న స్వామిని దర్శించుకోవటానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. గతంలో దీనిని యాదగిరి గుట్టగా పిలిచేవారు.

టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ క్షేత్రాన్ని కోట్ల రూపాయలు ఖర్చుచేసి, తిరుపతి తరహాలో మాఢవీధులు, ప్రాకారాలు, గోపురాలు, కాటేజీలు ఇలా అన్ని విషయాల్లోనూ ఆధునీకరించి దీనికి యాదాద్రి అనే పేరును ఖరారు చేశారు.

ఇంత వరకూ అంతాబాగానే ఉన్నా.. నూతన రూపు సంతరించుకున్నది మొదలు ఈ క్షేత్రం ఏదో ఒక అంశంలో వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ప్రముఖ సినీ ఆర్ట్‌ డైరెక్టర్‌ సాయిచే స్కెల్‌ వేయించి డెవలప్‌ చేసిన ఈ దేవాలయం రెండు సంవత్సరాల క్రితం కురిసిన భారీ వర్షాలకు గురైంది.

yadadri

ఈ సందర్భంగా నడక మార్గంలోని మెట్లు, ఘాట్‌రోడ్డు, కొండపైన కొన్ని ప్రాంతాలు ఈ వర్షాలకు దెబ్బతిని కుంగిపోయాయి. ఇది అప్పట్లో సంచలనం రేపింది. వెంటనే రంగలోకి దిగిన అధికారులు వాటిని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించారు.

అలాగే కొండమీదికి నాలుగు చక్రాల వాహనాలకు 500 రూపాయల టోల్‌ ఛార్జీలను నిర్ణయించడం కూడా వివాదాస్పదం అయ్యింది. తాజాగా స్వామివారికి నివేదించే కొబ్బరికాయల విషయంలో ఆలయ అధికారులు తీసుకున్న ఆనాలోచిత చర్య వివాదం రేపుతోంది.

గతంలో టెంకాయ మొక్కులను గర్భగుడిలోని స్వయంభువుల దగ్గరే తీర్చుకునే వారు. ఆధునీకరణ తర్వాత దానిని గర్భాలయం గడపకు ముందు ఉండే ధ్వజస్తంభం వద్దకు మార్చారు. ఆ తర్వాత దానిని పడమటి రాజగోపురం వద్దకు మార్చారు.

ప్రస్తుతం దాన్ని ఆలయానికి సంబంధం లేకుండా ఆంజనేయ ఆలయం సమీపానికి మార్చారు. ఈ విషయం తెలియని భక్తులు టెంకాయలతో క్యూలైన్‌లోకి వస్తుంటే వారిని ఆపివేసి టెంకాయలు అక్కడే పెట్టించి పంపిస్తున్నారు. లేదంటే టెంకాయ కొట్టి రావటానికి ఒకరిని లైన్‌ నుంచి బయటకు పంపుతున్నారు.

దీంతో వారి వెంట వచ్చిన ఇతర కుటుంబ సభ్యులు క్యూలైన్‌లో ముందుకు వెళ్లిపోతుండగా, టెంకాయ కొట్టిన భక్తులు మాత్రం మళ్లీ క్యూలైన్‌లో మొదటి నుంచి రావాల్సి వస్తోంది.

బయటకు వచ్చిన తర్వాత ఒకరినొకరు వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి టెంకాయలు కొట్టే స్థలానికి సంబంధించి సూచనలతో కూడిన బోర్డులను కొండమీద అన్ని చోట్లా ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.