ఎన్నికల హడావుడి అంటే తెలుగు రాష్ట్రాల్లోనే చూడాలి. ఇటీవల తెలంగాణలో ఎన్నికల సమరం ముగిసింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి మొదలైపోయింది. ఎన్నికల్లో ప్రత్యర్ధి పార్టీలను ఎదుర్కొంటూ ప్రజాభిమానం పొందటం ప్రతి పార్టీ ముందున్న కర్తవ్యం.
ఇందులో భాగంగా ఒక్కో పార్టీ ఒక్కో స్ట్రాటజీని ఫాలో అవుతుంది. సహజంగా అధికారంలో ఉన్న పార్టీకి కొంత ప్రచారంలో వెసులుబాటు ఎక్కువగా ఉంటుంది. అంతే గానీ అధికారంలో ఉన్న పార్టీ ఏం చేసినా ప్రజలు నమ్ముతారని కాదు.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంగ్రామ సన్నాహక సమావేశం ఈరోజు విజయనగరం జిల్లాలో జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ చేపట్టిన ‘యువ గళం’ పాదయాత్ర ముగింపు సభ ఇందుకు వేదికగా మారింది.
నాది అంబేద్కర్ రాజ్యాంగ పవర్… జగన్‌ది రాజారెడ్డి రాజ్యాంగం
ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా అటు టీడీపీ అధినేత, కార్యకర్తలు, నాయకులు, ఇటు మిత్రపక్షం జనసేన అధినేత, నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. అక్కడి జన సందోహం చూస్తుంటే నేల ఈనిందా.. ఆకాశం పొంగిందా అన్నట్టుగా ఉంది అనడంలో అతిశయోక్తి లేదు.
226 రోజుల పాటు 97 నియోజకవర్గాలను చుడుతూ.. 3,132 కి.మీ. పాటు సాగిన ఈ పాదయాత్రలో నారా లోకేష్ అలుపెరుగక నడక సాగించారు. చిత్తూరు జిల్లాలో ఈ సంవత్సరం జనవరి మాసంలో మొదలైన యాత్ర విజయనగరం జిల్లాలో ముగిసింది.
మధ్యలో చంద్రబాబు నాయుడు అరెస్ట్, లోకేష్‌పై కేసులతో కొద్ది రోజులు విరామం ప్రకటించినప్పటికీ, మళ్లీ యాత్రను కొనసాగించి ముగించారు. ఇరు పార్టీలకు చెందిన దాదాపు 600 మంది నాయకులు స్టేజిమీద కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.
అలాగే రాబోయే ఎన్నికల్లో ఇరు పార్టీలకు సంబంధించి ఉమ్మడి కార్యాచరణను నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఈ వేదిక మీద నుంచే ప్రకటించనున్నారు. ఈ సభతో 2024 ఎన్నికల ప్రచారం మొదలైనట్టుగానే చెప్పుకోవచ్చు.
వేదిక మీద నుంచి ఎటువంటి సందేశం, ప్రణాళికలు ఇరు పార్టీల అధినేతలు ప్రకటిస్తారోనని ప్రజలు ఆసక్తిగా టీవీల ముందు కూర్చుని తిలకిస్తున్నారు.