రాజకీయాల్లో గానీ, సినిమాల్లో గానీ ఒక నాయకుణ్ణి లేదా ఒక కథానాయకుణ్ణి అభిమానించడం వేరు.. ఆరాధించడం వేరు. వీటిని మించి కొందరు ఆయా నాయకులకు బానిసలుగా కూడా మారుతుంటారు. అంటే తమ నాయకుడు చేసే పని, మంచిదా.. చెడ్డదా అన్న వివేకం వీరికి ఉండదు.
నాయకుడు కుక్క అంటే.. కుక్కే. నక్కా అంటే… నక్కే. అంతే కాదు తమ నాయకుడి చర్యలను ఎవరైనా విమర్శిస్తే వీరు అస్సలు తట్టుకోలేరు. ఇక అవతలి వారు ఎవరు? వారి స్థాయి ఏమిటి అని కూడా చూడరు. ఇష్టారీతిన రెచ్చిపోతుంటారు.
తాజాగా అలా వివాదాస్పద మాటలతో రెచ్చిపోయారు కడపజిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని గురించి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిళ చేసిన విమర్శలపై ఆయన స్పందిస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు.
అసలు షర్మిళ రాజశేఖరరెడ్డి కూతురే కాదని, ఆయన పెంచుకున్న కూతురు అన్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఓ రేంజ్‌లో ట్రోల్ అవుతోంది.
కడపజిల్లాలో పుట్టి పెరిగిన రాచమల్లుకు, సుధీర్ఘకాలంగా వైయస్‌ఆర్ కుటుంబంతో పరిచయం ఉన్న రాచమల్లుకు షర్మిళ వైఎస్సార్ కన్నకూతురు కాదని ఇప్పుడే తెలిసిందా అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
జగన్‌మోహన్‌రెడ్డి దగ్గర పేరు తెచ్చుకోవడం కోసం ఏకంగా ఆయనతో పేగు బంధం కలిగిన షర్మిళను ఇలా మాట్లాడటం వైసీపీ వర్గాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఎంత రాజకీయాలు చేస్తే మాత్రం ఇంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకు తగదు. పార్టీలు మారిన తర్వాత ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకోవడం సహజమే అయినప్పటికీ ఇంతలా దిగజారి మాట్లాడని రాచమల్లు రేపు వైఎస్సార్‌సీపీని విడిచి వేరే పార్టీలోకి వెళితే జగన్ కూడా వైఎస్సార్ కన్న కొడుకు కాదని అనడని గ్యారంటీ ఏమీ లేదు.
వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో కూడా.. వివేకా హత్యతో వై.యస్. అవినాష్‌రెడ్డికి సంబంధం ఉందని అన్న మాట వినపడితే చాలు కడపజిల్లాలోని ఎమ్మెల్యేలం అందరం రాజీనామాలు చేస్తాం అని గతంలో ప్రకటించాడు ఇదే రాచమల్లు.
ఆ తర్వాత అవినాష్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసి బెయిలు కూడా ఇచ్చింది. మరి రాజీనామాలు ఎప్పుడు చేస్తారని మీడియా ప్రశ్నిస్తే ఏవేవో సాకులు చెప్పి తప్పించున్నాడు ఈ పెద్ద మనిషి. రాజకీయాలు అన్న తర్వాత కొంత విలువలు, విశ్వసనీయత ఉండాలి కదా..