అనుకున్నదే అవుతోంది. నాడు తన అవసరాలకోసం వదిలి బాణాన్ని అవసరం తీరాక పక్కన పడేయడంతో ఇప్పుడు ఆ బాణం తన ప్రతాపం చూపటానికి మళ్లీ ప్రజల మధ్యకు వచ్చింది. రావడమే కాదు.. ఏకంగా జగన్‌కే సరాసరి గురిపెట్టింది.
ప్రస్తుతం షర్మిళ వదులుతున్న మాటల తూటాలు చూస్తుంటే ఇది నూటికి నూరు శాతం నిజమనే నమ్మాలి. విషయంలోకి వెళితే… తమకుటుంబ విడిపోవటానికి జగనే కారణమని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిళ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… వైఎస్సార్ పాలన రైతులకు ఒక పండగలాంటిది. వైఎస్సార్ ప్రజల మనిషి. జగన్ ఒక నియంత. ప్యాలెస్‌లోనే కూర్చుంటాడు. బయటకు రాడు.
నేను ఏ స్వార్ధం లేకుండా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావటానికి కృషి చేశాను. ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్ మారిపోయాడు. ఎన్నికలకు ముందు స్పెషల్ స్టేటస్‌పై పోరాటాలు అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. కాంగ్రెస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని చీల్చింది అన్నాడు జగన్.
అయితే మా కుటుంబం విడిపోవటానికి జగనే కారణం. మా కుటుంబం చీలటానికి కారణం జగనే అనటానికి సాక్ష్యం పైనున్న ఆ దేవుడు, మా అమ్మ విజయమ్మ, నా కుటుంబ సభ్యులు. ఆయన జైల్లో ఉంటే నన్ను పాదయాత్ర చేయమని అడిగితే నేను నా కుటుంబాన్ని, పిల్లలను పట్టించుకోకుండా ఎండనక, వాననక రోడ్లమీద పడుకుని మరీ 3,200 కి.మీ. పాదయాత్ర చేశాను.
నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా. ఆయన మంచి ముఖ్యమంత్రి అయితే చాలు అనుకున్నాను. కానీ ఆయన నియంతలా మారారు. ఇప్పుడున్నది రాజశేఖరరెడ్డి గారి రాజ్యం కాదు. బీజేపీ పార్టీ రాజ్యం నడుస్తోంది. రాజశేఖరరెడ్డి గారి పనితీరు మీ పనితీరులో కనిపిస్తేనే మీరు రాజశేఖరరెడ్డిగారి వారసుడు ఎలా అవుతారు.
పెద్ద పెద్ద కోటలు కట్టుకుని ప్రజలను దగ్గరకు రానీయలేదు. మీరు ప్రజల దగ్గరకు రారు. ఎంతమంద కష్టపడితే జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఎంతమంది త్యాగాలు చేస్తే ముఖ్యమంత్రి అయ్యారు. నీ, నా అనుకున్న అందరినీ దూరం చేసుకున్నారు. రాజశేఖరరెడ్డి గారి పాలనకు, మీ పాలనకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అంటూ విరుచుకుపడ్డారు.