ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆసక్తికర పరిణామాలు సంభవిస్తున్నాయి.
ఓవైపు వైసీపీ నుంచి టీడీపీలోకి, టీడీపీలో నుంచి వైసీపీలోకి, వైసీపీలో నుంచి జనసేనలోకి, వైసీపీలోంచి కాంగ్రెస్‌లోకి వలసలు ప్రారంభం అయ్యాయి.
రాబోయే ఎన్నికల్లో ఈ వలసలు ప్రభావం ఏవిధంగా ఉండబోతోంది అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వర్గాలో తీవ్రమైన చర్చకు దారి తీస్తోంది.
అన్నిటికంటే ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి తనయ షర్మిళ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పగ్గాలు స్వీకరించనుండడం సంచలనం రేపుతోంది.
ఇప్పటికే తన ఒక్కగానొక్క సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో ఆమె విభేదించి ఆమధ్య తెలంగాణలో స్వంత పార్టీని పెట్టడం.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేయడం..
ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం ఊహించని పరిణామాలకు దారి తీసేలా ఉంది. ఈ ఊహించని పరిణామాల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం షర్మిళ ఇడుపాయలో తన తండ్రి సమాధిని దర్శించి,
ఆదివారం విజయవాడలోని ‘ఆహ్వానం’ కన్వెన్షన్ సెంటర్లో ఏపీసీసీ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంలో ఆమె వెంట మాజీ రాజ్యసభ సభ్యులు,
దివంగత వైఎస్సార్ ప్రాణ స్నేహితుడు కేవీపీ రామచంద్రరావు ఇడుపులపాయకు బయలు దేరారనే వార్త కాక రేపుతోంది.
వై.యస్. రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితులైన కేవీపీ రామచంద్రరావు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జగన్ స్థాపించిన వైఎస్సార్సీపీలోకి వెళతారనే ప్రచారం జరిగినప్పటికీ,
ఆయన కాంగ్రెస్‌ను వీడలేదు. తాజాగా ఆయన షర్మిళ వెంట ఇడుపులపాయకు రావడం విశేషమే. ఆయనతో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ఇడుపుల పాయకు రావడం కాంగ్రెస్‌లో కొత్త జోష్‌ను నింపుతుందని పార్టీ భావిస్తోంది.
అలాగే ఆదివారం విజయవాడలో జరిగే ప్రమాణ స్వీకారానికి కూడా వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి నాయకుల చేరికలకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.